06-02-2025 12:00:00 AM
వైభవంగా చెరువుగట్టు వార్షిక బ్రహ్మోత్సవాలు
నల్లగొండ, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వృషభ వాహనంపై ఆలయం నుంచి అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేర్చారు. అనంతరం పీటలపై ఆశీనులను చేసి ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు నడుమ మాఘశుద్ధ సప్తమి గడియల్లో కల్యాణ తంతు పూర్తి చేశారు.
ప్రభుత్వం తరపున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీసమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆది దంపతులకు తలంబ్రాలు సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
భక్తజన సందోహం..
కల్యాణాన్ని తిలకించేందుకు మంగళవారం రాత్రే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు చెరువుగట్టుకు తరలి వచ్చారు. ఆది దంపతుల కల్యాణాన్ని తిలకించి పరవశించి వెంట తెచ్చిన తలంబ్రాలు సమర్పించి సకల శుభాలు జరగాలని వేడుకున్నారు. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నిచర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ను నియంత్రించడం పోలీసులకు కష్టతరమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. ఫిబ్రవరి 9 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. గురవారం అగ్నిగుండాలు నిర్వహించనున్నారు.