calender_icon.png 19 October, 2024 | 7:54 AM

మన జాతి సంపద మూలవాసులు

07-08-2024 12:00:00 AM

మూలవాసులు.. పచ్చని ప్రకృతి ఒడిలో అడవి తల్లినే నమ్ముకొని తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలు. ప్రపంచ వ్యాప్తంగా 370 మిలియన్ల మూలవాసులు ఉండగా వారు 90 దేశాల్లో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో ఐదు శాతం మూలవాసులు ఏడు వేల భాషల్లో మాట్లాడుతున్నారు. ఐదువేల భిన్న సంస్కృతులు వీరివి. అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు.

1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 9న మూలవాసుల దినోత్సవం జరపాలని తీర్మానించింది. అప్పటి నుంచి మూలవాసుల హక్కులు గౌరవిస్తూ, వారి గొంతుకలను గుర్తిస్తూ, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మూలవాసుల హక్కులు.. పరిరక్షణకు సంబంధించి విజయక్రాంతి ప్రత్యేక కథనం.. 

అమలు కాని హక్కులు

అడవి బిడ్డలు కూడా మనతో సమానంగా శక్తివంతులు, సాంస్కృతికంగా సంపన్నులు. భారతదేశంలో దాదాపు 705 స్థానిక సమూహాలు/తెగలు/జాతులు ఉన్నాయి. ఎవరి ప్రత్యేకత వారిదే. ఈ జాతులన్నీ మన సమాజానికి దూరంగా ఉండొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి నమూనాలు వారికి తెలియపోవచ్చు.

విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన శైలులు, భాషలు, నమ్మకాలూ, ఆహారం వంటి విధానాలన్నీ మనకు పూర్తి భిన్నంగా ఉండొచ్చు. భారతీయ వారసత్వ మానవ సంపదకు ఉదాహరణగా ఉన్న వీరిలో కొందరు అంతరించిపోతున్న జాతులలో ఉన్నారు. మూలవాసులను పరిరక్షించుకోవడం ప్రభుత్వాల బాధ్యత. 

కనీస అవసరాలు..

* ఆదివాసీ భాషల పరిరక్షణ, భాషలకు లిపి ఏర్పరచడం, డిక్షనరీ తయారు చేయడం, బోధనకు అవసరమైన విద్యా మెటీరియల్స్ పరిరక్షించుకోవాలి. 

* ఆదివాసీల చరిత్ర, సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమాలకు సంస్థలకు, వ్యక్తులకు ప్రభుత్వం సహకరించాలి. 

* సాంస్కృతిక విద్య, బడులు ఏర్పాటు చేయాలి. పాఠాల్లో మూలవాసుల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి పొందుపరచాలి. 

* ఒక తరం నుంచి మరో తరానికి అందివచ్చిన సాంప్రదాయ విజ్ఞానాన్ని పరిరక్షించడం. ఆదివాసీల మేధో హక్కుల కింద పరిగణించాలి. 

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా..

ప్రపంచ మూలవాసీ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఒక థీమ్‌తో ముందుకు వెళ్తుంది. ఈ ఏడాది ‘ఒంటరిగా ఎవరితో సంబంధం లేకుండా ఉండే స్థానిక సమూహాల హక్కులు పరిరక్షించడం’ అంశంగా ప్రకటించింది. ఒంటరి స మూహాలు అంటే.. మన ప్రపంచానికి ఆవలి వైపు ఉన్న మరో ప్రపంచంలో ప్రజలు ఇం కా ఆదిమ పద్ధతుల్లో నివసిస్తున్నారని, ఆదిమ సమాజాలు ఉన్నాయని మనకు తెలియదు.

“ఒంటరి సమూహాలు మనతో ఉం డరు. వారు మన గురించి ఏమీ అడగరు. వారి గురించి మనకు ఏమీ తెలియకుండానే వారు జీవిస్తారు. మరణిస్తారు” అని సిడ్నీ పోస్సులో అంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిబిడ్డలు తమ మనుగడ సాగిస్తున్నారు. వీరికి అడవి అంటే ప్రాణం. 

మూలవాసుల సంస్కృతి పరిరక్షణ

ఆదిమ జీవనాన్ని కలిగి ఉండటం, అటవీ ఆధార జీవనం, వేట, పోడు వ్యవసాయంపై ఆధారపడటం, ప్రత్యేక భాషను లేక మాండలికాన్ని కలిగి ఉండటం, నాగరిక సమాజానికి దూరంగా పర్వతాల్లో అడవుల్లో ఒంటరిగా జీవించడం, పోడు వ్యవసాయానికి నాగలిని కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ఉండటం. ప్రత్యేక సంస్కృతి, వేషధారణను కలిగి ఉండటమేనేవి గిరిజనుల లక్షణాలు.

ఆదివాసీల జీవన గాధలు, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు రాయడం, ఫొటోలు, వీడియోల ద్వారా భద్రపరచాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు మూలవాసుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే కళాకృతులు, పనిముట్లు, హస్తకళలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

నిజానికి ఇది ఒక వ్యక్తి పని కాదు. మన ప్రభుత్వాలు చేయాల్సిన పని. దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కానీ అది ప్రయివేటు రంగంలో. వ్యక్తులుగా ఒకరు చేయలేని పని వ్యవస్థగా ప్రభుత్వం సులభంగా చేయగలదు.

అంతరించిపోతున్న తెగలు

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గుర్తించిన 705 గిరిజన తెగల్లో 75 గిరిజన తెగలను అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు లేదా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్‌గా పిలుస్తారు. వీరు కాలక్రమంలో అంతరించిపోయే దశలో ఉన్నారు. 2013 వరకు వీరిని పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్‌గా పిలిచేవారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి 75 అంతరించడానికి దగ్గరగా ఉన్న గిరిజన తెగలుండగా, అత్యధికంగా ఒరిస్సాలో ఇలాంటి తెగలు 13 ఉన్నాయి. తెలంగాణలో నాలుగు గిరిజన తెగలు ఇలాంటి స్థితిలో ఉన్నాయి. అవి.. చెంచులు, కొండరెడ్లు, కోలమ్‌లు, తోటిలు. వీరిలో మొదటగా పీవీటీజీగా గుర్తింపు చెంచులు పొందారు. 

2030  అజెండాగా..

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ‘ట్రాన్సోర్మింగ్ వరల్డ్ ది 2030 ఫర్ స్టునబుల్ డెవలప్‌మెంట్’ పేరుతో సుస్థిర అభివృద్ధి కోసం 2030 అజెండా ఆమోదించింది. 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఒక విస్తృతమైన, సార్వత్రిక విధాన అజెండా. ప్రపంచవ్యాప్తంగా 19 శాతం మూలవాసులు కటిక దరిద్రంలో మగ్గుతున్నారు. చారిత్రకంగా అణచివేతకు భౌగోళికంగా ఉన్నచోటు నుంచి నెట్టివేతకు గురవుతున్నారు.

వారి భూములు, ప్రాంతాలకు సరైన రక్షణ లేదు. అడవిబిడ్డల కాళ్ల కింద, వాళ్లు నడయాడిన నేల కింద ఉన్న విలువైన ఖనిజాల కోసం కార్పొరేట్ కంపెనీలు వారిని భయపెట్టో, బలవంతగానో నిర్వాసితులను చేస్తున్నారు. పెద్ద ఎత్తున అడవులను నరికి వేస్తున్నారు. తరిగిపోతున్న అడవుల వల్ల, ఖనిజాల వెలికితీత వల్ల నష్టపోతున్నది అడవిబిడ్డలతో పాటు జీవవైవిద్యం.

దీని మూలంగా ఆదివాసీలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇప్పటికే చాలా సమూహాలు తమ ఉనికిని కోల్పోయాయి. సమాజంతో సంపర్కంలో ఉన్న ఆదివాసీల భూములు ఆదివాసీ యేతరులు నిరంతరం ఆక్రమించుకోవడం దీనికి కారణం. ఇప్పటికైన కోర్టు ఇచ్చిన తీర్పులను అధికారులు సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. 

ఆదివాసీల ప్రధాన ప్రశ్న!

ప్రధానంగా నా అనుభవాన్ని మీతో చెప్పాలి. నేను కొత్తగూడెం దగ్గర కొన్ని ట్రైబల్ గ్రామాల్లోకి వెళ్లాను. అక్కడికి వెళ్లినప్పుడు పోలీసులు గూడెల్లో సర్వే చేయడానికి వచ్చిన మహిళలాను తరిమేస్తున్నారు. అరే ఎందుకు తరుముతున్నారు? ఏంటి అని అడిగినప్పుడు.. వాళ్లు ఏం చెప్పారంటే.. “చేప నీటిలో బతుకుతుంది కానీ బయట ఒడ్డున వేస్తే బతుకుతుందా”. అన్నారు.

అసలు విషయం ఏంటంటే.. ఆ గూడెలకు అనుకొని కొత్తగా ఎయిర్‌పోర్టు వస్తున్నది. మైనింగ్, ఎయిర్‌పోర్టుతో గూడెంలోని ఆదివాసీలను మైదాన ప్రాంతాల్లోకి పంపిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. “మేం అడవిలో పుట్టం.. అడవిలో పెరిగాం.. మేమే కాదు మా తాతల.. తాతల నుంచి అందరం కూడా ఇక్కడ పెరిగినా వారేమా. మా గూడెలను వొదిలి ఏదన్నా పని మీద కొత్తగూడెం వెళ్తే కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లలేం.

ఎందుకంటే మా పద్ధతి, మా అలవాట్లు అవి కాదు. బయటి వాతావరణంలో మేం ఇమడలేకపోతున్నాం. మేం మా దగ్గరే ఉంటాం.. మా ప్రాంతంలోనే ఉంటాం. మేం ఎవరీ స్థాలాలను, ఎవరీ భూములను మేం అన్యాయంగా లాక్కోలేదు. కానీ మమ్మల్ని ఎందుకు మా అడవికి దూరం చేస్తున్నరనేదే వాళ్ల ప్రధాన ప్రశ్నా”. నిజానికి అడవిలో వాళ్లు జీవనం కోసం మాత్రమే వ్యవసాయం చేస్తారు.

ప్రభుత్వాలు వాళ్లకు సధుపాయాలు కల్పించకపోగా.. నిర్వాసితులను చేస్తున్నది. ఈ విధ్వంసం వల్ల కేవలం గ్రామాలు మాత్రమే కాదు.. వాళ్ల జీవితం, సంస్కృతి, సంప్రదాయాలు, సమూహాలు విధ్వంసం అవుతున్నది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంలో నష్టపోతున్నది ఆదివాసీలు. 

 వి.శాంతి ప్రబోధ, ప్రముఖ రచయిత

ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు..

తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.876 లక్షల మూలవాసులు ఉన్నారు. తెలంగాణ జనాభాలో వీరి శాతం 9.34 శాతం. అక్షరాస్యత 49.51 శాతం. అయితే ఐదో షెడ్యూల్లో జీఓ నెంబర్ మూడు అని ఉద్యోగాలకు సంబంధించి ఉంది. సుప్రీం కోర్టు కూడా చెబుతున్నది 50 శాతం ఉద్యోగాలు ఎజెన్సీలో ఉన్నా ఆదివాసీలకు కేటాయించాలి. ఏ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు.

మైదాన ప్రాంతాల్లో ఉన్నా తెగల వాళ్లు గూడెల్లోకి వచ్చి ఆదివాసీలుగా చెప్పుకుంటూ గిరిజనుల రిజర్వేషన్లు కూడా అధిక శాతం దోచుకుంటున్నారు. అట్లా ఆదివాసీలు చెప్పేది ఒక్కటే జీవోను కచ్చితంగా అమలు చేయండి లేదంటే ఉద్యోగాల్లోకి తీసుకున్న వాళ్లను తొలగించండి అని అంటున్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన తీర్పు ఎస్సీలకు వర్గీకరణ చేయమని వచ్చింది కదా.. దాంతో పాటు ఎస్టీలో కూడా వర్గీకరణ చేయమంటున్నారు.

1976 ప్రకారం తీసుకోవాలి అని ఆదివాసీలు.. ఇప్పుడున్న ప్రభుత్వాలు అట్ల చేయకుండా ప్రస్తుత సెన్సెక్ లెక్కల ప్రకారం తీసుకుంటున్నది. అలా తీసుకుంటే వలస వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దాదాపు 35 తెగలు ఉన్నాయి. మేం సమాజంలో సగ భాగంగా ఉన్నాం. కాబట్టి వర్గీకరణ వొద్దు.. చేస్తే 1976 ప్రకారం వర్గీకరణ చేయండి అనేది మా ప్రధాన ఆరోపణ.  

 గుమ్మడి లక్ష్మీనారాయణ 

ఆదివాసీ రచయితల వేదిక, 

వ్యవస్థాపక కార్యదర్శి