calender_icon.png 18 January, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడికెడు మందికి కొండంత సంపద!

26-07-2024 01:53:23 AM

  1. గత పదేళ్లలో 1% సంపన్నుల సంపాదన 42 లక్షల కోట్ల డాలర్లు
  2. ఏటా పెరుగుతూ పోతున్న బిలియనీర్ల సంపద
  3. ప్రభుత్వాలు మారినా మారని పేదల బతుకులు

ప్రభుత్వాలు మారినా.. తరాలు మారినా..

తలరాతలు మారలే.. 

చట్టాలు మారినా.. అధికారులు మారినా 

పేదోడి బతుకు మారలే.. 

పన్నులు పెరిగినా.. మానిటరింగ్ పెరిగినా

ధనవంతుడి పెరుగుదల ఆగలే..

నివేదికలు వస్తున్నా.. ఆశ్చర్యం కలుగుతున్నా 

సంపన్నుడి ఆర్భాటాలు ఆగలే

ఎంతలా అంటే ఒక్క పెళ్లి కోసం ఐదు వేల కోట్లు పెట్టేలా..

ఇది ఆధునిక భారతమే కాదు.. అభివృద్ధి చెందిన ప్రపంచం కూడా.. 

న్యూఢిల్లీ, జూలై 25: అదేదో సినిమాలో చెప్పినట్లు రోజురోజుకూ సంపన్నుడు ఇంకా సంపాదిస్తూ మేడలను కట్టుకుంటూ పోతే.. పేదవాడు మాత్రం మరింత పేదవాడిగా అధఃపాతాళానికి పడిపోతున్నాడు. తాజాగా వెలువడిన ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా ఇదే స్పష్టం చేసింది. సాధారణ మధ్య తరగతి ప్రజలు రోజు మొత్తం కష్టపడ్డా కానీ రూ.1000 కూడా సంపాదించలేని ప్రస్తుత తరుణంలో కోటీశ్వరులు మాత్రం మనీని మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఆక్స్‌ఫామ్ అనే సంస్థ విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఎవరికైనా సరే.. కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

అంతలా రిచ్, పూర్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్‌లో ఉన్న 1 శాతం మంది గత పదేళ్లుగా 42 లక్షల కోట్ల డాలర్లు సంపాదించినట్లు ఈ నివేదిక తెలిపింది. అలాగే సంపాదనలో అట్టడుగున ఉన్న 50 శాతం మంది ప్రజల సంపాదన ఈ 1 శాతం మంది సంపాదన కంటే 34 రెట్లు తక్కువట. గత నాలుగు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపద ఏటా సగటున 7.1 శాతం మేర పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 

చట్టాలు చుట్టాలయ్యాయా?

బిలియనీర్లు కేవలం వారి సంపదలో 0.5 శాతం మాత్రమే పన్నులు కడుతున్నట్లు నివేదిక తెలిపింది. ప్రపంచంలో ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే ఈ సో కాల్డ్ బిలియనీర్లపై 8 శాతం వరకు పన్నులు విధించాల్సిన అవసరం ఉందట. ప్రస్తుతం ఉన్న బిలియనీర్లలో ప్రతీ ఐదుగురిలో ఒకరు జీ20 దేశాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఈ బిలియనీర్లు పన్ను చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ పన్నులు తక్కువగా కడుతున్నారని, కొంత మంది ఎగవేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.