calender_icon.png 20 October, 2024 | 5:23 AM

సచివాలయం మార్గం దద్దరిల్లింది

20-10-2024 02:09:39 AM

  1. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన
  2. మద్దతు తెలిపిన కేంద్రమంత్రి బండి సంజయ్ 
  3. అశోక్‌నగర్ నుంచి సచివాలయం వరకు ర్యాలీ
  4. ర్యాలీకి మద్దతు ప్రకటించిన బీఆర్‌ఎస్ 
  5. చర్చలకు కూడా పిలవకపోవడం విచారకరం: బండి
  6. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే గోపాల్, శ్రీనివాస్ గౌడ్, దాసోజు అరెస్ట్ 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన ఉధృతమైంది. శనివారం గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన చలో సచివాలయం ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అశోక్‌నగర్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా సచివాలయం వరకు చేపట్టిన ర్యాలీలో అభ్యర్థులకు మద్దతుగా కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు.

శనివారం ఉదయం 11 గంటల సమయంలో చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి తన అనుచరులు, బీజేపీ నాయకులతో కలిసి సంజయ్ వచ్చారు. అయితే అప్పటికే గ్రూప్-1 అభ్యర్థులు ర్యాలీగా అశోక్ నగర్ చౌరస్తా వరకు చేరుకోవడంతో భారీ కాన్వాయ్‌తో బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థుల ర్యాలీ వద్దకు వచ్చి జీవో-29ని రద్దు చేయాలని హైకోర్టులో కేసువేసిన హనుమాన్ అనే అభ్యర్థితో మాట్లాడారు.

అశోక్‌నగర్ చౌరస్తాలో సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ఆందోళన చేశారు.  అనంతరం సంజయ్ అక్కడి నుంచి సచివాలయం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ర్యాలీగా వచ్చిన నిరుద్యోగులతో పాటు బండి సంజయ్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. బండి తరలింపును బీజేపీ కార్యకర్తలు, అభ్యర్థులు అడ్డుకోవడంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు జీవో రద్దు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫ్లకార్డు ప్రదర్శించారు. 

చర్చలకు పిలవలేదు..

రాష్ట్రంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంజయ్ విమర్శించారు. గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులను సీఎం రేవంత్ రెడ్డి చర్చలకు కూడా పిలవకపోవడం విచారకరమని అన్నారు. చివరకు తమను కూడా ప్రభుత్వం చర్చలకు పిలవలేదన్నారు.

సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. నిరుద్యోగ అభ్యర్థులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేవరకు పోరాడుతామని అన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

పరీక్ష ఎలా నిర్వహిస్తారు..

 గ్రూప్-1పై హైకోర్టులో 22 కేసులు పెండింగ్‌లో ఉండగా పరీక్ష ఎలా నిర్వహిస్తారని ఆయన నిలదీశారు. నిరుద్యోగులు అందరూ ఆందోళనలో ఉన్నారని, మహిళా అభ్యర్థులను సైతం బట్టలు విప్పి కొట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. గర్భిణీ మహిళా అభ్యర్థులపై కూడా పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజాం, కేసీఆర్ పాలనలోనే ఇలాంటి దారుణాలను చూశామన్నారు. హైకోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందన్నారు. తెలుగు అకాడమీ సిలబస్ చదవకుండా ఏం చదివి పరీక్ష రాయాలన్నారు. తెలుగు అకాడమీ సిలబస్ పనికిరాదని ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు. హాల్ టికెట్ల జారీలోను గందరగోళం సృష్టించారన్నారు.  

విధ్వంసానికి బీఆర్‌ఎస్ కుట్ర..

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆందోళనపై బీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందన్నారు. తాము పాల్గొన్న ర్యాలీలో చొరబడి విధ్వంసాలకు పాల్పడాలని చూస్తే నిరుద్యోగులు అడ్డుకున్నారని చెప్పారు. అలాగే తమ పార్టీ కార్యకర్తలతో గులాబీ నాయకులు గొడవకు దిగారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం: ఆర్‌ఎస్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అప్రజాస్వామికంగా ఉందని బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ర్యాలీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.  గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి వారు సచివాలయం వైపు వెళ్తుండగా, బీఆర్‌కే భవన్ వద్ద వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

అయితే నాయకులను తరలించే క్రమంలో గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారుల మధ్య భారీ తోపులాట జరిగింది.  పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి అక్కడి నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‌ను తరలించారు.

అభ్యర్థుల ర్యాలీ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆర్‌ఎస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలను చెప్పేందుకు వెళ్తున్న తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులు సాయంత్రం వరకు సచివాలయం వద్దకు చేరుకొని ప్రధాన గేటు ముందు బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

ఎన్నికల సమయంలో నిరుద్యో గులను అనేకసార్లు కలిసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తమపై ఉక్కుపాదం మోపుతున్నారని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా జీవో అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు.  

సీఎం స్పందించాలంటూ..

 గ్రూప్-1 అభ్యర్థులు ర్యాలీతో అశోక్‌నగర్, ఇందిరాపార్కు, ట్యాంక్‌బండ్, సచివాలయ పరిసరాలు అట్టుడికిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతాలు మార్మోగాయి. జీవో 29 వద్దంటూ విద్యార్థులు ఫ్లకార్డులను ప్రదర్శించారు. తమ ఆందోళనలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిందని, తమ వల్లనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జీవో 29ని రద్దు చేసి గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, లేనిపక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని అభ్యర్థులు హెచ్చరించారు.

గతంలో రాహుల్‌గాంధీతోపాటు అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి తమ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థించాడని, కానీ ఇప్పుడు తమకు అన్యాయం చేస్తూ కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్‌నగర్, గాంధీనగర్, ఇందిరాపార్కు తదితర వీధులన్నీ ఆందోళనకారులు, పోలీసులతో కిక్కిరిపోయాయి.  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా, జీవో-29 రద్దు చేయాలని కోరుతూ మెయిన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల ఆందోళనకు నిరుద్యోగ అభ్యర్థులు గత రెండు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.