calender_icon.png 21 April, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కార మార్గం

21-04-2025 12:08:56 AM

-కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్య 

-ఇల్లెందు, టేకులపల్లిలో అవగాహన సదస్సులు      

ఇల్లెందు/టేకులపల్లి, ఏప్రిల్ 20  (విజయక్రాంతి):తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో రైతాంగ సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేందుకు మార్గం సుగమమైందని, సమస్యల పరిష్కార మార్గం భూభారతి చట్టమని  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.

ఇల్లందు మండలం బొజ్జాయి గూడెం, టేకులపల్లి మండల కేంద్రాల్లో  ఆదివారం భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సుల్లో  జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ రైతాంగ భూ సమస్యలు పరిష్కారానికి గతంలో సరైన చట్టం లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని , ప్రస్తుత భూ భారతి చట్టంతో రైతులు తమ భూ సమస్యలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్న సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా భూభారతిలో అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

ఆదివాసీ చట్టం సత్వర పరిష్కారానికి సులభమైన మార్గం చూపిస్తుందని తెలిపారు. ధరణి పోర్టల్లో తప్పుల సవరణకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఆ ఇబ్బందులు ఉండవన్నారు. భూభారతి చట్టంపై రైతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.

రిజిస్ట్రేషన్, పేరు మార్పిడి, సర్వే నెంబర్లు, రైతులు కలిగి ఉన్న గట్టు పంచాయతీలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం ఉండేది కాదని ఇప్పుడు ఆ సమస్యను గ్రామస్థాయిలోని గ్రామ పాలన అధికారి విచారణతో పరిష్కారానికి మార్గం సుగుమంకానున్నద న్నారు. జిల్లాలో తొమ్మిది లక్షలకు పైగా సాదా బైనామా పెండింగ్ కేసులు ఉన్నాయని ఇప్పుడు భూభారతితో పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాటికి పరిష్కారం చూపిస్తామన్నారు.

వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేపట్టి రైతులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు సంబంధించి స్పష్టమైన భూభారతిలో చట్టం తీసుకొచ్చారని ఈ చట్టం ద్వారా సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్న వారికి న్యాయం జరుగుతుందన్నారు. రైతులకు అందించే పాస్ పుస్తకాలలో రైతుకు సంబంధించిన భూమి మ్యాప్ సైతం పొందుపరచడం జరుగుతుందని దీనివల్ల ఒకే స్థలాన్ని పలువురికి అమ్మి మోసపూరిత వ్యక్తులకు చెక్ పడనందని తెలిపారు.

భూభారతి చట్టంతో ఆదివాసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భూ భారతి ఆదివాసి చట్టాలకు అనుగుణంగా భూభారతి పోర్టల్ ను రూపొందించడం జరిగిందని ఆదివాసీలు ఎటువంటి అపోహలకు పోవద్దన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఆరు ఏడు సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బందులు పడుతున్నారని భూభారతితో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.

భూభారతి చట్టం రైతులకు కొండంత ధైర్యం : ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం భూ భారతి తో రైతుల భూ సమస్యల కొండంత ధైర్యం ఇస్తుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.  భూ సంబంధిత సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తి కూడదనే, ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు.

భూ సమస్యలు మార్పులు చేర్పులు, మ్యుటేషన్, ఇతర సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. ఈ చట్టం రైతులకు మాత్రమే కాదని, రెవెన్యూ అధికారులకు కూడా ధైర్యం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం ఆర్దీఓ మధు, ఇల్లందు, టేకులపల్లి తహసీల్దార్లు రవికుమార్, నాగభవాని, వ్యవసాయాధి కారులు, రెవిన్యూ అధికారులు, రైతులు, నాయకులూ తదితరులు పాల్గొన్నారు.