calender_icon.png 18 April, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గుతున్న డిండి నీటిమట్టం

10-04-2025 01:01:44 AM

10 అడుగుల మేర పూడిక

పాతికేళ్లలో రెండు పంటలకు  నీరందింది రెండుసార్లే..

భవిష్యత్‌లో తప్పని ఇబ్బందులు 

దేవరకొండ, ఏప్రిల్ 9 :  దేవరకొండ నియోజకవర్గంలోని డిండి రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులు (2.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం (ఒక టీఎంసీ) 22 అడుగులకు చేరింది. గతేడాది ఆగస్టులో ఎగువన కురిసిన భారీ వర్గాలకు రిజర్యాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. దీంతో ఆయకట్టులో వానాకాలం, యాసంగి పంటల సాగుకు నీరందింది. 

ప్రాజెక్టులో 10 అడుగుల మేర పూడిక ..

నాటి నిజాం ప్రభుత్వం 1940లో డిండి ప్రాజెక్టు పనులు ప్రారంభించగా 1943 జూలైలో పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు వర్షాదారితం కావడంతో నిర్మించిన నాటి నుంచి నీటితోపాటు వచ్చిన చేరిన బురదతో ప్రాజెక్టులో 10 అడుగులమేర పూడిక పేరుకుపోయింది. ప్రారంభంలో రెండు పంటలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు పూడిక కారణం నిల్వ సామర్థ్యం తగ్గి ఒక సీజన్కే నీరందించే స్థితికి చేరింది.

దీంతో ప్రాజెక్టు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు  1996లో నాబార్డ్ నిధులు రూ. 6.31 కోట్లతో స్పిల్ వేను ఎత్తు మూడు అడుగులు పెంచారు. అయినా సరే గతంలో మాదిరి రెండు పంటలకు సాగునీరు అందడం లేదు. పూడికతో రిజర్వాయర్ ఏటా 539. శాతం నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతోంది. 1943లో ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 2.61 టీఎంసీలు కాగా 2022న నిర్వహించిన సీడబ్ల్యూసీ సర్వే నిల్వ సామర్థ్యం 2.4 టీఎంసీలుగా తేల్చింది. ఏటా 0.02 టీఎంసీల మేర ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గుతున్నదని సర్వే లెక్కగట్టింది. 

పాతికేళ్లలో రెండు పంటలకు రెండుసార్లే ..

డిండి ప్రాజెక్టు నిర్మించిన ప్రారంభంలో రెండు పంటలకు నీరందేది. క్రమేణా ఎగువ నుంచి నీటి రాక లేకపోవడంతో మూడు, నాలుగేళ్లకు ఒకసారి రిజర్వాయర్ నిండేది. 2000 నుంచి నేటి వరకు పాతికేళ్లలో 2021-22, 2024-25 లో మాత్రమే ప్రాజెక్టు నుంచి రెండు పంటలకు సాగునీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 12,500 ఎకరాలు ఆయకట్టు ఉంది.

నాలుగైదేండ్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి సీఫేజ్ నీరు వచ్చి చేరుతుండటంతో డిండి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటుంది. నీటి లభ్యత పెరగడంతోపాటు సాగు విస్తీర్ణం పెరిగి ఆయకట్టు రైతులకు ప్రాయోజనం చేకూరుతున్నది. రిజర్వాయర్లో చేపలు పట్టి 100 మత్స్యకార కుటుంబాలు సైతం జీవనోపాధిని పొందుతున్నాయి.