* ఎండీ అశోక్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో జలమండలికి చెందిన భూమి కబ్జా కాలేదని వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సంబంధిత స్థలాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. 2006లో ఆనాటి ప్రభుత్వం మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం కోసం 24.20 ఎకరాల భూమిని జలమండలికి కేటాయించగా, అత్తాపూర్‌లో 23, 51 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన రెండు ఎస్టీపీలను నిర్మించినట్టు తెలిపారు.
పట్టణీకరణ కారణంగా కాలనీల సంఖ్య పెరగడంతో మురుగు ఉత్పత్తి సైతం అంతే స్థాయిలో పెరిగిందన్నారు. ఆ నీటిని సైతం శుద్ధి చేసేందుకు మరో 2 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగానే 64, 40 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మరో 2 కొత్త ఎస్టీపీలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఈ సమయంలోనే కొందరు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా.. అధికారులు అప్రమత్తమై హైడ్రా, రెవెన్యూ శాఖల అధికారులతో సర్వే చేసి సరిహద్దుల్ని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.