26-04-2025 01:10:48 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పెహల్గాం ఉగ్రదాడిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానించారు.‘దాడికి పాల్పడిన ముష్కరులు పర్యాటకుల మతాన్ని అడిగి మరి తుపాకీ ఎక్కుపెట్టారు. హిందువులు ఎన్నటికీ ఇలాంటి పనిచేయరు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవు.
ఇది మన స్వభావం కాదు. రామాయణ ఇతిహాసంలో రావణుడు తన మనసు మార్చుకునేందుకు ఒప్పుకోలేదు. తప్పని పరిస్థితుల్లో రాముడు, రావణున్ని సంహరించాడు. అలాగే కొందరు దుర్మార్గులు ఎంతచెప్పినా మారడానికి సిద్ధంగా ఉండరు. అలాంటి వారిని అంతమొందించాల్సిందే.
మనమంతా ఐక్యంగా ఉంటే.. ఎవరూ మనపై దాడి చేయడానికి ధైర్యం చేయరు. కొన్ని విద్రోహ శక్తులు దేశాన్ని విడదీయడానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద ధర్మం గెలవాల్సిందే. వారికి సరైన విధానంలో బుద్ధి చెప్పాల్సిందే’ అని అన్నారు.