30-03-2025 01:03:02 AM
మజ్లిస్ దేశద్రోహ పార్టీ
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మార్చి 29 (విజయక్రాంతి): రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ శనివారం రూ.15 లక్షలు మంజూరు చేశారు. న్యాయవాదులంతా బండి సంజయ్‌ను సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, ఒవైసీ సహా కుహానా లౌకిక వాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంట్‌లో త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశం ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఉద్ఘాటించారు. న్యాయవాదుల కాన్ఫరెన్స్ కోసం సీఎస్సార్ ఫండ్స్ నుండి మరో 50 లక్షల సాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.