17-12-2024 12:15:29 AM
సిరిసిల్ల, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పల్లెల్లో పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడుతోంది. చెట్లను నరికి వేస్తూ, పర్యావరణానికి కలప వ్యాపారులు ముప్పు తెస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చెట్లను నరికివేస్తూ కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. లారీలు, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వ్యాపారులు ఆన్‌లైన్‌లో ఒక చెట్టును కోసేందుకు అనుమతి తీసుకుని, పది నుంచి ఇరువై చెట్ల వరకు నరికివేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం పాత అనుమతులను చూపుతూ కలపను అక్రమంగా తరలిస్తున్నారు. అటవీశాఖ నిబంధనల మేరకు ఆన్‌లైన్‌లో కేవలం రూ.500 చెల్లిస్తే చాలు అనుమతి లభిస్తుంది. దీంతో కలప వ్యాపారులు పల్లెల్లో ఉండే వేప, తుమ్మ, చింత, రాగి, మర్రి చెట్లను నరికివేస్తున్నారు.
రోడ్డు వెంట, పొలాల వద్ద ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన అనుమతి ప్రకారం లొకేషన్ వద్దకు అటవీశాఖ అధికారులు వెళ్లి పరిశీలించిన అనంతరం చెట్టును నరికివేయాల్సి ఉంటుంది. కానీ వాటిని వ్యాపారులు పట్టించుకోకుండా ఒక చెట్టుకు చలాన్ కట్టి పది చెట్లను నరికివేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. కలప వ్యాపారులు ప్రతి నెల మామూళ్లు ముట్ట జెప్పుతారనే ఆరోపణలున్నాయి.
సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడలో ఫారెస్ట్ రేంజ్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా కలప వ్యాపారం సాగుతోంది. గంభీరావుపేట, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో కలప వ్యాపారం నిత్యం సాగుతోంది.
ఇతర రాష్ట్రాలకు కలప రవాణ
జిల్లాలో నరికివేసిన కలపను ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గజసింగవరం, వెంకటాపూర్, సిద్దిపేటకు చెందిన కలప వ్యాపారులు పల్లెల్లో పాగా వేసి, చెట్లను నరికివేస్తూ కలపను లారీల్లో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను అడ్డగా తయారు చేసుకుని కలపను ట్రాక్టర్లతో తరలించి, అక్కడి నుంచి లారీల్లో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అటవీశాఖలోని లొసుగులతో వ్యాపారులు చలాన్ పేరిట కలప వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికే దట్టమైన అటవీప్రాంతాలు మైదానాలుగా మారే ప్రమాదం నెలకొంది. అటవీ ప్రాంతాల్లో భూమిని అక్రమంగా ఆక్రమించుకునే క్రమంలో అడ్డుగా ఉన్న చెట్లను నరికివేస్తున్నారు.
వ్యాపారులు పల్లెల్లో ఏజెంట్లను సైతం ఏర్పాటు చేసుకుని ఈ వ్యాపారం సాగించడం గమనార్హం. ఆ ఏజెంట్లు రైతుల వద్దకు వెళ్లి చెట్లు నరికివేసేందుకు ఒప్పించి, ఆ విషయం వ్యాపారులకు అందించడంతో తన బలగంతో వచ్చి చెట్లను నరికివేసి, ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు.
అక్రమంగా కలప తరలిస్తే చర్యలు
జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. వాల్టా చట్టం ప్రకారం చలాన్ కట్టిన వ్యక్తులకు కలపను తీసుకెళ్లే అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే కలప రవాణా చేయాలి. లేదంటే కేసులు నమోదు చేస్తాం. అక్రమ కలప రవాణా అడ్డుకునేందుకు ప్రజలు పూర్తిగా సహకరించాలి.
-కల్పనాదేవి, స్ట్రుకింగ్ ఫోర్స్ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా