సానుభూతి ఓట్ల కోసమే జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, మే 11 (విజయక్రాంతి): నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశానని, ఎన్నికల్లో గెలిచి ఆ డాక్యుమెంట్‌లో హామీలను అక్షరాలా అమలు చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. నిజామా బాద్ ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే జూన్ పార్లమెంట్ సమావేశాల్లోనే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెడతామన్నారు. తద్వారా అంబేద్కర్ ఆశయాన్ని నిజం చేస్తామన్నారు. ఆ తర్వాత అందరికీ ఒకే విధమైన చట్టం అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రాధా న్యం ఇస్తామన్నారు. దేశాన్ని మత ప్రాతిపదికన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా విడగొట్టి ముస్లింలకు ఇచ్చినప్పుడు, ఇక్కడి హిందువులకు ప్రత్యేక దేశం ఉండాల్సిమందన్నారు. రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చి భ్రష్టు పట్టించిందన్నారు. ఎక్కువసార్లు రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేన న్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతోందంటూ కాంగ్రెస్ ప్రచా రం చేయడం విడ్డూరమన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. తమ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కుండ బద్దలు కొట్టారు.
గల్ఫ్ బోర్డు హామీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మానిఫెస్టోలో లేదని, దీన్నిబట్టి బాధితులపై కాంగ్రెస్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల్లో తన గెలుపు ఖాయ మైందని, గత ఎన్నికలో కంటే ఈసారి ఎక్కు వ మెజార్టీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనపై ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, భవిష్యత్తులోనూ ఉండబోవ న్నారు. ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. ఇవే తన చివరి ఎన్నికలంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి సానుభూతి ఓట్లను ఆశిస్తున్నారని, ఎన్ని చేసినా ఆయనకు పరాభవం తప్పదన్నారు.