calender_icon.png 4 May, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పిలుస్తున్నది!

20-04-2025 12:00:00 AM

ఎత్తయిన కొండలు.. లోతైన కోనలు.. చెట్లు పుట్టలు.. అరణ్యాలు.. పచ్చటిపొలాలు.. గలగలాపారే సెలయేర్లు, కిలకిలమనే పక్షులు.. అబ్బురపరిచే జంతువులు ఇవేగా టూర్ అంటే..మరివన్నీ మీ ఊర్లోనే పెట్టుకుని మళ్లీ ఎక్కడికెక్కడికో వెళ్లడం ఎందుకు? నగర జీవితంలో ఉక్కపోతను అనుభవిస్తున్న వలసజీవికి ఇప్పుడీ కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అందుకే మళ్లీ పల్లె పిలుస్తోందంటూ గ్రామాల్లో వాలిపోతున్నారు ఆధునికులు. ఫలితంగా రూరల్ టూరిజం కొత్తపుంతలు తొక్కుతున్నది. 

రూరల్ టూరిజం అంటే పల్లె పర్యాటకం అని అర్థం. సాధారణంగా మనం ఒక రాష్ట్రానికో, దేశానికో వెళ్తే అక్కడి ప్రధాన ముఖ్య పట్టణాల్లోనో, నగరాల్లోనో లేదంటే ప్రాచుర్యం పొందిన ప్రదేశాల్లోనో వాలిపోతాం. అంటే మనందరి దృష్టిలో పర్యాటకం అంటేనే ప్రసిద్ధ ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన దేవాలయాలు, సముద్రతీరాలు, జంతుప్రదర్శన శాలలు, మ్యూజియంలు, భారీకట్టడాలు, సాహసయాత్రలు, హోటళ్లు, మాల్స్ ఇవే అనుకుంటాం? పైకి కనువిందు చేసేవన్నీ.. ఆ ప్రాంత సంస్కృతి అనే భ్రమలో ఉండిపోతాం. అది పొరపాటు. ఒక ప్రాంత స్వభావాన్ని తెలుసుకోవాలంటే.. పల్లె మూలాల్లోకి వెళ్లాలి. అలా మనల్ని అసలుసిసలు లోకంలోకి తీసుకేళ్లేదే రూరల్ టూరిజం. 

పల్లెలే పట్టుగొమ్మలు.. 

నాగాలాండ్‌లోని ఖొనమా పల్లె దేశంలోనే తొలి ‘గ్రీన్ విలేజ్’ గా ఎంపికైంది. అక్కడి అంగామి గిరిజన తెగ వ్యవసాయ పద్ధతులు, సంస్కృతి చూడటానికి టూరిస్టులు కదిలారు కాబట్టే ఆ రికార్డు అందుకుంది. అస్సోంలోని మజులి, ఒడిశాలోని పిపిలి, అరుణాచల్ ప్రదేశ్‌లో జీరో వ్యాలీ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతాల్లో రూరల్ టూరిజం బాగా ప్రాచుర్యం పొందింది. పల్లె ప్రయాణాలకు ప్రాణవాయువుగా నిలిచే రాష్ట్రం కేరళ.

వయనాడ్, కోజికోడ్, మున్నార్, మలప్పురం, కొట్టాయం.. ఇలా ఎక్కడ చూసినా రూరల్ టూరిజానికి మంచి రూట్ మ్యాప్ వేసింది కేరళీయులే. ఇందుకూ కారణముంది. దేశస్వర్గధామంగా పేరుగాంచిన కేరళలో టూరిజం అనే పదం పురాతనమైనది. రూరల్ టూరిజం అనే పదం వైరల్ కాకముందే పల్లెలోకి టూరిస్టులను నడిపించిన సారధులు వీళ్లు. 

ఉభయ రాష్ట్రాల్లో..

మన ఉభయ రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో పోచంపల్లి, వెంకటాపూర్ రామప్ప దేవాలయం, భద్రాద్రి, కీసరగుట్ట, మేడారం.. ఇలా దాదాపు డెబ్బయ్‌కి పైనే రూరల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి. పల్లె పర్యాటకంలో భాగంగా విడిది చేసేందుకు హోమ్‌స్టేలు ఉన్నాయి.

ఇలా హోమ్ స్టే ఇవ్వడం వల్ల ఆ ఇంటి యజమానులకు కొంత సంపాదన మార్గం అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తాళ్లపాక, గండికోట, చెక్కబొమ్మలకు ప్రసిద్ధి అయిన ఏటికొప్పాక, అనంతగిరి, అల్లికలకు పేరుగాంచిన నరసాపురం, లేపాక్షి, లంబసింగి, పుత్తూరు, బాపట్ల ఈస్ట్.. ఇలా రూరల్ టూరిజానికి డెస్టినేషన్స్.