calender_icon.png 12 December, 2024 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దవాఖాన ఖాళీ!

12-12-2024 12:29:44 AM

  1. క్లినిక్‌నూ ఖాళీ చేసి ఉడాయించిన ఆర్‌ఎంపీ
  2. ఆర్‌ఎంపీ వెనుక చక్రం తిప్పిన బీఆర్‌ఎస్ లీడర్!

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలోని మహిళా సమాఖ్య భవనంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవఖానాలోనే ఆర్‌ఎంపీ వైద్యు డు గుట్టుచప్పుడు కాకుండా షెట్టర్ ఏర్పాటు చేశారు.

దీనిపై బుధవారం ‘పల్లె దవఖానాల్లో ఆర్‌ఎంపీ వైద్యం’ పేరుతో విజయ క్రాంతి కథనాన్ని ప్రచురించగా కలెక్టర్ బదావత్ సంతోష్ సీరియస్ అయ్యారు. సమగ్ర నివేదిక కోరుతూ జిల్లా వైద్యాధికారులను అదేశించారు. డిప్యూటీ వైద్యాధికారి వెంకటదాసు, కొల్లాపూర్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజశేఖర్ పల్లె దవాఖాన తనిఖీ చేసేలోపే సదరు ఆర్‌ఎంపీ సామాగ్రితో పాటు ఉడాయించాడు.

పల్లె దవాఖాన బోర్డులను కూడా చెరిపేసి ఉండటంతో గ్రామస్థులంతా ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. పల్లె దవఖానాను కూడా ఖాళీ చేయాలని ఏపీఎం పార్వతమ్మ, మహిళా సమాఖ్య సభ్యులు నీరజ, అరుణ జిల్లా అధికారులపై ఒత్తిడి తేవడంతో వైద్యాధికారులంతా అయోయం లో పడ్డారు.

అధికారిక మహిళా సమాఖ్య భవనం అయినప్పటికీ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా గత ఆరేళ్లుగా ఆర్‌ఎంపీ క్లినిక్ కొనసాగడం వెనుక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు అండగా ఉన్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం పల్లె దవాఖానాలు ప్రారంభించగా తీగలపల్లిలో ప్రభుత్వ భవనాలు లేక మహి ళా సమాఖ్య భవనంలోనే ఏర్పాటు చేశారు.

అప్పటికే ఆర్‌ఎంపీ అద్దె ప్రాదిపదికన షెల్టర్ ఏర్పాటు చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ ఏడిదిన్నరగా పల్లె దవఖానాలోనే ఆర్‌ఎంపీ క్లినిక్ ఎలా కొనసాగిందన్న ప్రశ్నలకు జిల్లా వైద్యాధికారులు నీళ్లు నములుతున్న పరిస్థితి.

తెరవెనుక బీఆర్‌ఎస్ లీడర్!

ప్రభుత్వ మహిళా సమాఖ్య భవనంలోనే ఆర్‌ఎంపీకి ఎలా ఆశ్రయం కల్పించారన్న విషయంలో ఉన్నతాధికారులకు కూడా అం తు  పట్టడంలేదు. సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్నా డీఆర్డీవో శాఖ అధికారులకు తెలియకుండానే కొనసాగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైద్యులు, సిబ్బందికి, పర్యవేక్షకులకు, జిల్లా స్థాయి వైద్యాధికారులకు తెలియకుండా పల్లె దవఖానాలోనే ఆర్‌ఎంపీ క్లినిక్ ఎలా కొనసాగించారన్న విషయంలో ఎవరూ నోరువి ప్పడం లేదని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎంపీ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రనిధి తన రాజకీయ లబ్ధి కోసం ఆర్‌ఎంపీని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా సమాఖ్య భవనాన్ని ఇతరులకు అద్దెలకు ఇచ్చే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా డీఆర్డీవో చిన్న ఓబులేషును వివరణ కోరగా అందుబాటులోకి రాలేదు.