calender_icon.png 6 October, 2024 | 5:57 PM

కొరియర్ పేరుతో సైబర్ మోసం

06-10-2024 12:53:06 AM

10 నిమిషాల్లో తిరిగి చెల్లిస్తామని రూ.24.58 లక్షలు లూటీ

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : పది నిమిషాల్లో నగదు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఓ బాధితుడి ఖాతా నుంచి రూ.24.58 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సికింద్రాబాద్‌కి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి.. ఫెడెక్స్ ఎగ్జిక్యూటివ్ అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీరు ఫెడెక్స్ కొరియర్ ద్వారా ఇరాన్‌లో ఉండే డాక్టర్ అర్మాన్ అలీకి 20 కిలోల డయాబెటిక్ డ్రగ్స్‌తో పాటు 100 గ్రాముల ఎండీఎంఏను పంపుతున్నారని గుర్తించామని తెలిపాడు.

దీంతో బాధితుడు అలాంటి పార్శిల్ నేనేమి పంపలేదు, దానితో నాకెలాంటి సంబంధం లేదని, అసలు డాక్టర్ అర్మాన్ అలీ ఎవరో నాకు తెలియదు అని బదులిచ్చాడు. కానీ.. మీ కొరియర్‌పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)కి తెలియజేశామని, పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నాడు.

ఈ క్రమంలో ఏమైనా సందేహాలు ఉంటే ఎన్‌సీబీ అధికారులతో మాట్లాడాలని.. వారికి కాల్ కనెక్ట్ చేసినట్లు నటించాడు. అనంతరం ఎన్‌సీబీ అధికారినంటూ లైన్‌లోకి వచ్చిన మరో సైబర్ నేరగాడు వాట్సాప్ వీడియో కాల్‌లో విచారణ చేపట్టాడు. అనంతరం సైబర్ క్రైమ్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)తో మాట్లా డాలని సూచించాడు.

అనుమానం వచ్చిన బాధితుడు అవతలి వ్యక్తిని వారి గుర్తింపు కార్డులు చూపించమని అడగగా.. మోసగాళ్లు చివరికి వారి నకిలీ గుర్తింపు కార్డులు చూపించారు. ఇలా పోలీసు అధికారుల వేషంలో ఉన్న వ్యక్తులు..  బాధితుడిని బెదిరించి 6 గంటలకు పైగా విచారించారు. మొత్తంగా బాధితుడు తన ఫిక్స్‌డ్ డిపాజిట్లు రద్దు చేసుకుని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేసేవరకు ఒత్తిడి తెచ్చారు.

విచారణ నేపథ్యంలో తన ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఆర్బీఐ ఖాతాకి బదిలీ చేయాలని, విచారణ పూర్తయిన 10 నిమిషాల్లో డబ్బు తిరిగి పంపిస్తామని చెప్పారు. లేకపోతే ఎన్‌సీబీ అధికారుల బృందం మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందని భయబ్రాంతులకు గురిచేశారు.

దీంతో బాధితుడు ఇదంతా నిజమేనని అనుకొని వారు సూ చించిన ఖాతాకు రూ.24.58 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.