నేడు జూపూడి యజ్ఞనారాయణ జయంతి
- ఆయన స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా కఠెవరం
- చిన్నతనంలోనే నాటకరంగంలోకి ప్రవేశం.. నటుడిగా గుర్తింపు
- బీఎల్ పూర్తి చేసి న్యాయవాదిగా కార్మికులకు సేవలు
- ఆర్‌ఎస్‌ఎస్ కీలక సభ్యుడిగా విశేష సేవలు.. రాజకీయవేత్తగా విఖ్యాతి
- ఏపీలో భారతీయ జన సంఘ్, బీజేపీ స్థాపనలో ముఖ్యభూమిక
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): బహుముఖ ప్రజ్ఞాశాలి జూపూడి యజ్ఞనారాయణ. రాజకీయవేత్తగా, కళాకారుడిగా, న్యాయవాదిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్దాల పాటు ఆయా రంగాల్లో సేవలందించారు. యజ్ఞనారాయణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరం. జగన్నాథరావు, వెంకాయమ్మ దంపతులకు 26 డిసెంబర్ 1915లో జన్మించారు. స్వగ్రామంలో పాఠశాల విద్య, గుంటూరులో బీఏ, మద్రాసులో బీఎల్ పూర్తి చేశారు. తర్వాత ఆయన ప్రస్థాన నాటక, కళా రంగాల వైపు మళ్లింది. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి ఆకర్షితుడై ‘భారతీయ్ జన సంఘ్’లో సభ్యుడిగా చేరి రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు.
చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి..
కళలకు పుట్టినిల్లుగా, ఆంధ్రాప్యారిస్‌గా పేరున్న తెనాలివాస్తవ్యులు కావడంతో ఆయనకు చిన్నప్పటి నుంచి కళారంగంపై ఆసక్తి కలిగింది. నాటక సంస్థలు స్థానికంగా నిర్వహించే ప్రదర్శనలను చూస్తూ తాను నటుడు కావాలనుకున్నారు. 1935లో బీఏ చదువుతున్న కాలంలో మొదటి సారి షేక్స్‌పియర్ ‘ట్వెల్త్ నైట్’లో చిన్నపాత్ర ధరించారు. ఇంగ్లిష్‌పై ధారాళ మైన పట్టుఉండడంతో ఆంగ్లేయులకు దీటుగా ప్రదర్శన ఇచ్చి వారి మెప్పు పొందారు.
1941లో ‘నవజ్యోతి సమితి’ స్థాపించారు. చిత్తూరు నాగయ్య, కొంగర జగ్గయ్య, ఎన్టీఆర్ వంటి నటులు ఈ నాటక సమాజంలో సభ్యులుగా ఉండేవారు. వారితో కలిసి యజ్ఞనారాయణ అనేక నాటక ప్రదర్శనలిచ్చారు. ధుర్యోధనుడు, బలరాముడు, బుస్సీ, తానీషా పాత్ర లు ధరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో ఆయన ‘ఆంధ్రప్రదేశ్ థియేటర్ అకాడమీ’చైర్మన్‌గా మూడు పర్యాయా లు సేవలందించారు. ప్రతాపరుద్రీ యం, తులసీ జలంధర, విప్ర నారాయణ, శ్రీకృష్ణ తులాభారం, గయోపఖ్యానం, రామదాసు వంటి పాత్రలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక నేతగా..
నటుడిగా, న్యాయవాదిగానే కాక రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు యజ్ఞనారాయణ. ఆయన చాలా చిన్నవయస్సులోనే రాజకీయాలకు ఆకర్షితుల య్యారు. 1940లోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక సభ్యుడయ్యారు. భారతీయ మజ్జూర్ యూనియన్ నేతగా కార్మిక హక్కుల కోసం పోరాడారు. 1968 శాసనమండలి సభ్యుడయ్యారు. 1971 73 మధ్య సాగిన జై ఆంధ్రా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జన సంఘ్ స్థాపనకు కృషి చేశారు.
భారతీయ జన సంఘ్ జాతీయ ఉపా ధ్యక్షుడిగా సేవలు అందిచారు. జన్ సంఘ్ తర్వాత బీజేపీగా రూపాంతరం చెందే ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలు శిక్ష సైతం అనుభవించారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో పనిచేసి 1998లో ఆయన వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. బీజేపీ అగ్రనేతలైన అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, సుబ్రహ్మణ్యస్వామి వంటివారితో ఆయన సన్నిహిత సంబంధాలు నెరిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతగా యజ్ఞనారాయణకే పేరు ప్రఖ్యాతలు న్నాయి. గతేడాది వరకు భారత ఉప రాష్ట్రపతిగా సేవలందించిన వెంకయ్యనాయుడు సైతం తాను యజ్ఞనారాయణ శిష్యుడినని అనేక సభల్లో ప్రకటించారు. బండారు దత్తాత్రేయ, ఆలె నరేంద్ర వంటి నేతలు కూడా యజ్ఞనారాయణను గురువుగా భావించేవారు.
క్రీడలపైనా ఆసక్తి..
యజ్ఞనారాయణకు క్రీడలపైనా మక్కువ ఉండేది. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడేందుకు ఇష్టపడేవారు. తర్వాత షూటింగ్, వాలీబాల్‌పై ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో ఆంధ్రపదేశ్ ఫుట్‌బాల్, వాలీబాల్, రైఫిల్ అసోసియేషన్లలో దశాబ్దాల పాటు కీలక సభ్యుడిగా కొనసాగారు. అలాగే పలు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా కొనసాగారు. ఆయన నేతృత్వంలో వందలాది మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ప్రాతినిధ్యం వహించారు.
న్యాయవాదిగా కార్మికుల పక్షాన..
ఒకవైపు నాటకరంగంలో ప్రదర్శనలిస్తూనే గుంటూరు కేంద్రంగా న్యాయ వాదిగా ప్రాక్టీస్ చేసేవారు. పేదల పక్షాన వాదిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎక్కువగా కార్మికుల సమస్యలను వాదించేవారు. యాజమాన్యాల నుంచి కార్మికులకు అందాల్సిన పరిహారంపై న్యాయపోరాటం చేశారు. వందలాది కుటుంబాలకు యాజమాన్యాల పరిహారం ఇప్పించారు. కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేశారు.
అందుకే ఆయన వాదించే కేసులు ఎక్కువగా లేబర్ కోర్టు పరిధిలోనే ఉండేవి. నిరపేద పిటిషనర్ల కష్టాలను చూసి, చలించిపోయి వారిని కోర్టు ఖర్చులు సైతం అడిగేవారు కాదు. స్వయంగా యజ్ఞనారాయణే ఫీజు కూడా చెల్లించేవారు. కార్మికులకు దాఖలు చేసిన పిటిషన్లకు ఎక్కువ సమయం కేటాయించి, తక్కువ సమయం వెచ్చించి సివిల్, క్రిమినల్ కేసులను వాదించేవారు.
తండ్రి మార్గంలోనే కుమారుడు
యజ్ఞనారాయణ నిత్యం రాజకీయాలు, కళారంగ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. సతీమణి హైమావతి ఆయనకు అన్నివిధాలుగా సహకరించేవారు. ఆయన కుమారుడు జూపూడి రంగరాజు గుంటూరులో ప్రముఖ న్యాయవాది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర నేతగా కొనసాగుతున్నారు. పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సమన్వయకర్తగా సేవలందిస్తున్నారు.