calender_icon.png 1 April, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్2ఈ సినిమా కాదు.. మా రక్తం

22-03-2025 12:00:00 AM

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఎల్2ఈ: ఎంపురాన్’. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మురళీగోపి కథను అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ చేశారు. ముంబై వేదికగా జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పలువురు సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు మోహన్‌లాల్ మాట్లాడుతూ “ఎల్2ఈ: ఎంపురాన్’ జర్నీ మరచిపోలేని అనుభవం. ఇలాంటి పాన్ ఇండియా సినిమాను రూపొందించటానికి మా ప్రయాణం ఏడేళ్లుగా కొనసాగుతోంది. అతంటి భారీ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించారు పృథ్వీరాజ్. దీన్ని సినిమా అని చెప్పటం కంటే మా చెమట, రక్తం అనొచ్చు. ఇదొక ట్రయాలజీ మూవీ. అందులో ఇప్పటికే లూసిఫర్ సినిమా వచ్చింది. మార్చి 27న  ‘ఎల్2ఈ’ రానుం ది. మరో సినిమానూ రూపొందించాల్సి ఉంది. సినిమానే మాట్లాడుతుంది. సముద్రంలాంటి సినిమాను రూపొందించాలనుకున్నాం.

అది దీంతో నేరవేరింది. మనం నమ్మశక్యం కానీ గొప్ప సినిమాలను రూపొందించగలం. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న తొలి ఐమ్యాక్స్ ఫార్మాట్ మూవీ ఇది. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఈ మూవీలో మ్యాజిక్ ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడాలనుకుంటున్నా” అన్నారు. 

డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ “డైరెక్టర్‌గా ఓ సినిమాను తెరకెక్కించటం సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా ‘ఎల్2ఈ: ఎంపురాన్’ వంటి సినిమాలను చేయటం మామూలు విషయం కాదు. లూసిఫర్ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించాలనుకున్నప్పుడు తొలి భాగం మంచి విజయాన్ని సాధించింది. రెండో భాగానికి సంబంధించిన ఆలోచనే నా మదిలో ఉంది. దీన్ని పూర్తి మలయాళ సినిమాగా రూపొందించాలనుకోవటం ఛాలెంజింగ్‌గా అనిపించింది. కథకు కావాల్సిన కాన్వాస్, సినిమాకు అవసరమైన స్కేల్ అసాధారణంగా ఉంది.

2022లో మోహన్‌లాల్‌ను కలిసి తొలిసారి  ఈ స్టోరీ నెరేషన్ ఇచ్చాను. ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే అవకాశాలు సగమే ఉన్నాయనే ఆలోచన నా మనసులో ఉందప్పుడు. అయితే మోహన్‌లాల్ కథ విని, ఈ సినిమాను మనం చేస్తున్నాం అన్నారు. ఆ మాటే నన్ను ఇంతవరకు నడిపించింది. నిర్మాతలు ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ మాకు అండగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తోంది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మంజు వారియర్, ఏఏ ఫిల్మ్స్ అధినేత అనీల్ తడాని, నిర్మాత గోకులం గోపాలన్, ఇంద్రజీత్, రైటర్ మురళీగోపి తదితరులు పాల్గొన్నారు.