calender_icon.png 1 April, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో ఆగని రేషన్ దందా!

31-03-2025 01:50:33 AM

  1. పలుచోట్ల డీలర్లు, దళారుల కుమ్మక్కు
  2. లబ్ధిదారుల నుంచి కొని అక్రమంగా  విక్రయం
  3. రాత్రివేళ లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలింపు
  4. చోద్యం చేస్తున్న పౌరసరఫరాల శాఖ 
  5. పట్టించుకోని స్థానిక అధికారులు 

నల్లగొండ/వేములపల్లి, మార్చి 30 (విజయక్రాంతి) : రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేస్తున్నా అక్రమార్కులు ఏమాత్రం బెదరడం లేదు. స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహాయ సహకారంతో దందా యథేచ్ఛగా కొనసాగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొందరు రేషన్ డీలర్లు, దళారు లు కుమ్మకై వివిధ మార్గాల్లో బియ్యాన్ని పట్టిస్తున్నారు. ప్రతినెలా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. కొందరు రేషన్ డీలర్లు బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేయకపోవడం, లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ నెల 17న వేములపల్లి మండలంలోని ఓ రేషన్ డీలర్ వద్ద దళారులు బియ్యం కొనుగోలు చేసి లారీలో తరలిస్తుండగా కేతేపల్లి మండలం ఇనుపాముల సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, హాలియా తదితర ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ పలుమార్లు ఇక్కడ రేషన్ బియ్యం భారీగా పట్టుబడిన  ఘటనలున్నాయి. పీడీఎస్ బియ్యం అమ్మినా.. కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాదళారుల్లో మార్పు రావడం లేదు. 

దందాలో డీలర్ల ప్రమేయం!

కొందరు డీలర్లే నేరుగా పీడీఎస్ బియ్యం దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దళారులతోపాటు డీలర్లు లబ్ధిదారుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. కిలోకు రూ. 10 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేసి 40 నుంచి 50 క్వింటాళ్ల కాగానే దళారులకు అమ్ముతున్నట్లు వినికిడి.

ఇటీవల కేతేపల్లి పోలీసులు ఇనుపాముల వద్ద తనిఖీల్లో పట్టుకున్న 45 క్వింటాల పీడీఎస్ బియ్యం పోలీసుల విచారణలో వేములపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన డీలర్ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మినట్లు తేలింది. ఏకంగా పౌరఫరఫరాల శాఖ నుంచి వచ్చిన గన్నీ బ్యాగుల్లోనే బియ్యాన్ని విక్రయించడంతో పోలీసులు కంగుతిన్నట్లు సమాచారం.

ఈ డీలర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కొందరు రాజకీయ పైరోలు, మరికొందరు అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి గుట్టుగా బయటపడున్నట్లు ఆరోపణలున్నాయి. 

సన్నబియ్యం వచ్చినా ఆగేనా? 

రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రేషన్ లబ్ధిదారులకు  సన్న బియ్యం సరఫరా చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో ఆదివారం పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో 84 శాతం మందికి సన్నబియ్యం అందనున్నాయి. సన్న బియ్యం సరఫరా చేస్తుండడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కానీ  దళారులు, అక్రమాలకు అలవాటు పడిన కొందరు డీలర్లు బియ్యం దందాను కొనసాగించే అవకాశం లేకపోలేదు. అక్రమ దందాను ఆపే బాధ్యత అధికారులపై ఉన్నది. దందాకు అడ్డుకట్ట పడాలంటే సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు ఎప్పటికప్పడు రేషన్ దుకాణాలను తనిఖీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.