20-02-2025 01:17:18 AM
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి19: హిందువుల ఐక్యతే ఛత్రపతి శివాజీ జీవిత సందేశమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. హిందూ రాజ్య స్థాపన కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పాటుపడిన మహనీయుడు శివాజీ అని కొనియాడారు.
ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని తన కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలోని ముఖ్యాంశాలు.
శివాజీ మహారాజ్ జీవితం నుండి మనం స్పూర్తి పొందాల్సిన ప్రధాన అంశం హిందూ ఐక్యత. హిందువులందరూ సంఘటితంగా లేకపోతే ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయనేది ఆ రోజే శివాజీ చెప్పిండు. హిందూ సమాజాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు ఆనాటి నుండి ఈనాటి దాకా జరుగుతూనే ఉన్నయ్. శివాజీ మహారాజ్ చరిత్ర మీ అందరికీ తెలుసు.
శివాజీ మహారాజ్ అందరిలాంటి మామూలు రాజు కాదు. అందరి రాజవంశీయుల్లాగే వారసత్వంతో సింహాసనం మీద కూర్చోలేదు. మొఘల్స్ చక్రవర్తులు ఆనాడు మత దురహంకారంతో భరతమాత మీద, హిందూ ధర్మం మీద దాడులు చేస్తుంటే ఎదిరించిన వీరుడు శివాజీ.
తల్లి జిజియా బాయి, గురువు బాటలో నడిచిన శివాజీ హిందూ ధర్మ రక్షణ కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారు. తన 17వ ఏటనే యుద్ద భూమిలోకి అడుగుపెట్టి శత్రువులను చీల్చి చెండాడిన యోధుడు. ఔరంగజేబుకు చుక్కలు చూపించి హిందూ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు. శివాజీ మహారాజ్ చరిత్ర నుండి నేటితరం స్పూర్తి పొందాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. శివాజీ మహారాజ్ స్పూర్తి తో మనమంతా ఐక్యంగా ఉండాలె. హిందువులంతా ఐక్యంగా ఉండటమే శివాజీ మహా రాజ్ కు నిజమైన నివాళి.
జబ్బాపూర్ ఘటనపట్ల దిగ్బ్రాంతి
వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జెండా ఎగరేస్తుండగా అనుకోకుండా కరెంట్ వైర్లను తాకి నిప్పు రవ్వలు చెలరేగడడంతో ప్రశాంత్ అనే యువకుడు మరణించడంపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానునభూతి తెలియజేశారు. ఈ ఘటనలో గాయడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.