calender_icon.png 2 February, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్ అద్భుతం

02-02-2025 12:21:30 AM

  1. అన్నివర్గాల ప్రజలకు అనుకూలమైన పద్దు
  2. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మక నిర్ణయం 
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని, పద్దు పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఉద్యోగులకు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం విప్లవాత్మక నిర్ణయమన్నారు.

గడిచిన 75 ఏళ్లలో మధ్యతరగతి ప్రజల కోసం ఇంత అనుకూలమైన బడ్జెట్ ఎన్నడూ రాలేదని అభిప్రాయపడ్డారు. 2027 నాటికి అమెరికా, చైనా తరువాత భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనడానికి, బడ్జెట్ రూపకల్పనే ఉదాహరణ అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే టీవీ, మొబైల్స్, లెదర్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ధరలు తగ్గబోతున్నాయని వెల్లడించారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు వాడుతున్న ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నదని తెలిపారు.

పప్పు దినసుల కోసం ప్రత్యేక కమిషన్, జాతీయ పత్తి కమిషన్  ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. తద్వారా తెలంగాణ రైతులకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కేంద్రం ఎంస్‌ఎంఈ రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచిందని, స్టార్టప్‌లకు రూ.20 కోట్ల వరకు రుణాలిస్తుందని తెలిపారు.