22-03-2025 11:48:13 PM
సర్క్యులర్‌పై ప్రశ్నిస్తే అరెస్టులా ? విద్యార్థి సంఘాల నాయకులు
ఓయూలో బీఆర్‌ఎస్‌వీ, ఏఐఎస్‌ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్, బీఆర్‌ఎస్‌వీ ఓయూ నాయకులు డిమాండ్ చేశారు. సర్క్యులర్‌పై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఓయూలోని పలు హాస్టళ్లలో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఏఐఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షుడు నెల్లి సత్య, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు జంగయ్య, బొల్లు నాగరాజు యాదవ్, ఓయూ నాయకులు ఏల్పుకొండ రామకృష్ణ, సాయిగౌడ్, ఏఐఎస్‌ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఉప్పల ఉదయ్ కుమార్, భగత్, తదితరులున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఓయూ విద్యార్థులు ప్రశ్నించకుండా గొంతు నొక్కేందుకే అప్రజాస్వామికంగా సర్క్యులర్‌ను ఇచ్చారన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఓయూ వీసీ, రిజిస్ట్రార్ సమ్మతంగా లేరని, రెండు నెలలుగా వారు విద్యార్థులను కలవడంలేదని ఆరోపించారు. 2017 పీహెచ్‌డీ విద్యార్థుల గడువు పెంచాలని, దివ్యాంగ విద్యార్థుల మెస్ సమస్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకుండా వీసీ ప్రొ.కుమార్ ఓయూలో పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తున్నారన్నారు.