calender_icon.png 17 November, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతిమ లక్ష్యం అదే: నిఖత్

13-06-2024 04:34:54 AM

న్యూఢిల్లీ: ఆటలో కఠిన ‘డ్రా’ ఎదురైనప్పుడే తన ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన నిఖత్ ప్రాక్టీస్ మరింత ముమ్మరం చేసింది. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న హైదరాబాదీ తాజాగా తన సన్నద్ధతపై స్పందించింది. ‘ఒలింపిక్స్‌లో ఎలాంటి సీడింగ్స్, రేటింగ్స్ ఉండవు. అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. తొలి రౌండ్, రెండో రౌండ్‌లో ఎవరిని ఎదుర్కొంటానో చెప్పలేను.

కానీ ఆటలో కఠిన డ్రా ఎదురైనప్పుడే నా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండడం చాలాసార్లు గమనించా. ఇదే నా మొదటి ఒలింపిక్స్ కావడంతో రోజులు దగ్గరపడేకొద్దీ ఒత్తిడికి లోనవుతున్నా. అయితే ఒత్తిడిలోనే నా ప్రదర్శనపై ఎక్కువ దృష్టి సారించగలను. బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్ తర్వాత వరల్డ్ చాంపియన్ కావడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే అంతిమ లక్ష్యం’ అని నిఖత్ చెప్పుకొచ్చింది. ఆసియా గేమ్స్‌లో కాంస్యం గెలవడం ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్ ఇటీవలే ఎలోర్డా కప్‌లో విజేతగా నిలిచింది.