పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో శ్రియా రెడ్డి నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ఓజీ’ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. “గడిచిన ఏడాది కాలం నాకెంతో ప్రత్యేకం. గతేడాది చివరిలో విడుదలైన ‘సలార్ సీజ్‌ఫైర్’లో నా పాత్ర బాగా ఆకట్టుకుంది. దీనిలో నేను ఖాన్సార్ సామ్రాజ్యానికి ఆధిపత్యం వహించే పాత్ర పోషించా.
ఇక ఈ ఏడాది ‘తలైమై సేయలగం’లో రాజకీయ నాయకురాలిగా నటించా. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రానున్న బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటైన ‘ఓజీ’లో చేస్తున్నా. ప్రస్తుతానికి నా చేతిలో ‘ఓజీ’ మాత్రమే ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘సలార్’లోని రాధారమ పాత్రకు ఈ చిత్రంలోని పాత్రకు ఎలాంటి సంబంధమూ ఉండదు. రెండు పాత్రల ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. స్క్రీన్‌పై నన్ను చూసిన వారు ఆశ్చర్యపోతారు.
పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చేశాను. ఆయన చాలా తెలివైన వ్యక్తే కాకుండా హూందాగా వ్యవహరిస్తారు. ఆయనొక అద్భుతమైన వ్యక్తి. ఎదుటి వ్యక్తులతో ఆయన ప్రవర్తన, మాట్లాడే విధానం చాలా బాగుంటుంది” అని శ్రియా రెడ్డి వెల్లడించారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ని డీవీవీ దాన య్య నిర్మిస్తున్నారు.