తెలంగాణకు కరెంటే జీవనాడి లాంటిది. రాష్ట్రంలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నా.. ఆ నదీ జలాలను వాడుకోవాలన్నా కరెంటే కావాలి. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రైతులు, ప్రజలు కరెంటుకోసమే కొట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కరెంటు కొరతను అధిగమించేందుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. అందులో ప్రధానమైనవి మూడు. ఒకటి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు. రెండోది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, మూడు.. నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. ఈ మూడింటి విషయంలో మొదటి నుంచీ విమర్శలు, అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణతోపాటు, దాని ఏర్పాటుపైన కూడా బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అభ్యంతరం తెలిపారు. ఇదే విషయంలో ఆయన హైకోర్టుకు కూడా వెళ్లినా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు కమిషన్ విచారణలో వేగం పెంచింది. విద్యుత్తు విషయంలో మొదటి నుంచీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నవారు అసలు తప్పులు ఎక్కడ జరిగాయనే అంశంపై కమిషన్‌కు వివరాలు అందిస్తున్నారు. ఈ అంశాలపై ప్రజలు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి కమిషన్ దృష్టి సారించవల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
- * తెలంగాణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించిన విద్యుత్తు సంక్షోభాన్ని నివారించటానికే నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ సర్కారుతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకొన్నదా?
- * ఒప్పందంలోని అన్ని షరతులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒప్పుకోలేదా? ఒప్పందం ప్రకారం విద్యుత్తు మొత్తం సరఫరా చేయటానికి ఆసక్తి చూపలేదా?
- * తక్కువ రేటుకు వచ్చే విద్యుత్తును విస్మరించి ఎలాంటి పర్యావరణ అనుమతులు, టెండర్లు లేకుండా పనిని అప్పగించారు. అలా చేసినందుకైనా విద్యుత్తు కొరతను అధిగమించారా?
- * టెండర్లు పిలిస్తే స్పందించేందుకు ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌నే ఎందుకు ఎంచుకొన్నది?
- * సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్లు రెండేండ్లలోనే నిర్మించి విద్యుత్తు ఉత్పత్తి చేయాలన్న కేసీఆర్ ప్రణాళికకు ఎన్జీటీ తీర్పు, కొవిడ్ సంక్షోభం గండికొట్టాయా?
- * ఎన్జీటీ ఆదేశాలు, కొవిడ్ లాక్‌డౌన్‌తోపాటు అదనపు పనులు చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ కారణంగానే ప్రాజెక్టుల నిర్మాణం ముందుగా అనుకొన్నట్టు రెండేండ్లలో పూర్తిచేయలేకపోయారా? అందువల్లనే వ్యయం అసాధారణ స్థాయిలో పెరిగిపోయిందా? ప్రజలపై మోయలేని భారంగా మారటానికి అదే కారణమా?
- * బీహెచ్‌ఈఎల్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొంటే కేసీఆర్ ప్రభుత్వం యంత్రాల కొనుగోలు విషయంలో మరింత బేరమాడి ప్రస్తుత రేట్లతో పోల్చితే సగం ధరలకే దక్కించుకొని కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం పొదుపు చేసే అవకాశం ఉండేదా?
- * బీహెచ్‌ఈఎల్ వద్ద కొనుగోలు చేసిన యంత్రాల మెయింటనెన్స్ బాధ్యతలను ఆ సంస్థే చూసుకొనేలా ఒప్పందంలో నిబంధన పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం పొరపాటు చేసిందా?
- * ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో అదనపు వడ్డీ భారం పడకుండా చేసి కోట్లాది రూపాయలను మిగిలించగలిగేలా బీహెచ్‌ఈఎల్‌నుగానీ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థ గానీ యంత్ర పరికరాలను ఫిక్స్‌డ్ రేట్లకు సొంత నిధులతో సరఫరా చేయాలని కోరకుండా కేసీఆర్ ప్రభుత్వం తప్పుచేసిందా?
- * పవర్ ప్లాంట్లను బొగ్గు గనుల దగ్గర లేదంటే ఇతర రాష్ట్రాల్లో నౌకాశ్రయాల సమీపంలో ఏర్పాటుచేసి విదేశీ బొగ్గుతో నడిపించేలా హామీ ఇవ్వాల్సి ఉండెనా?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
- * బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన అదనపు పని విలువ ఎంత? ఆ పనికి మార్కెట్ రేట్లకంటే అదనంగా చెల్లించారా? అనేది తేల్చాలి. నిధుల మళ్లింపు, దుర్వినియోగం, అధిక చెల్లింపులపై బీహెచ్‌ఈఎల్ సబ్ కాంట్రాక్టర్లతో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
* బీహెచ్‌ఈఎల్ ద్వారా తన పాత యంత్రపరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి అంటగట్టిన ఇండియా బుల్స్ సంస్థపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. ఇండియా బుల్స్ నుంచి పరోక్ష చెల్లింపులు, ఒప్పందం ప్రకారం ప్లాంటు పూర్తి సామర్థ్యం మేరకు నడుస్తున్నదా? లేదా? ఈ విషయంలో ఏమైనా జరిమానాలు విధించారా? అన్న అంశంపై కూడా దర్యాప్తు నిర్వహించాలి.
* ఒప్పందం ప్రకారం విద్యుత్తు సరఫరా చేయలేకపోయిన ఛత్తీస్‌గఢ్ జెన్‌కో తనకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం క్లెయిమ్ చేసిన మొత్తాన్ని వెంటనే ఆ రాష్ట్రం నుంచి రాబట్టాలి. పీజీసీఐఎల్‌కు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించిన మొత్తాన్ని కూడా రాబట్టాలి.
* సింగరేణి ఎంతో సమర్థవంతమైన సంస్థ. బొగ్గు మైనింగ్‌లో అపార అనుభవం ఉన్న సంస్థ. ఈ సంస్థను విదేశాల్లో బొగ్గు గనులను దక్కించుకొనేలా విస్తరించాలి. అలా చేస్తే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఖర్చులు తగ్గుతాయి.
* తెలంగాణ, ఒడిశాతోపాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనుల సమీపంలో, నౌకాశ్రయాల వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటుచేయాలి.
* ఎన్టీపీసీ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ ఖర్చుతో విద్యుత్తు ప్లాంట్లను నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలించాలి.
* సీఎంగా తన నిర్ణయాల వెనుక అసలు కారణాలను ప్రజలకు తెలిపేందుకు గొప్ప అవకాశంగా భావించి మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్తు విచారణ కమిషన్ ముందు హాజరు కావాలి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి