calender_icon.png 5 February, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ ట్రంప్ శకం

21-01-2025 12:00:00 AM

అమెరికాలో మరోసారి ట్రంప్ శకం ప్రారంభమయింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు) ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్నికల్లో విజయం సాధించిన దాదాపు రెండున్నర నెలల విరా మం తర్వాత అధికార పగ్గాలు చేపట్టినట్లయింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఆయన దాదాపు 100 కీలక ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడిగా తానేమి చేయబోతున్నానో ప్రమాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన  విక్టరీ ర్యాలీలో ట్రంప్  స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తన హయాంలో నెరవేరుస్తానని మరోసారి హామీ ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా అక్రమ వలసదారులను బైటికి పంపించి తీరుతానని స్పష్టం చేశారు.‘ రేపు సూర్యుడు అస్తమించే సమయానికి మన దేశంపై దాడి ఆగిపోతుంది.

మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నాం. అమెరికన్ బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజు ను ప్రారంభించనున్నాం’ అంటూ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’( మాగా) ర్యాలీలో  స్పష్టం చేశారు. కాగా వాతావరణం అనుకూలించని కారణంగా క్యాపిటల్ భవనం వెలుపల జరగాల్సిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇన్‌డోర్‌కు మార్చాల్సి వచ్చింది. వాషింగ్టన్‌లో కనీస ఉష్ణోగ్రత మై నస్ డిగ్రీలకు పడిపోవడంతో ఈ మార్పు జరిగింది.

1985లో రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ట్రంప్‌తో పాటుగా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ట్రంప్ ప్రమాణస్వీకారం వేళ యూఎస్ క్యాపిటల్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ దాదాపు 2 లక్షల మంది ట్రంప్ మద్దతుదారులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రపంచ దేశాధినేతలు, పారిశ్రామిక, ప్రపంచ కుబేరుల సమక్షంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రధాని మోదీ ప్రతినిధిగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటుం డగా, అతిథులుగా ముకేశ్ అంబానీ దంపతులు హాజరవుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటికి, ఇప్పటికి ఆయన తీరులో ఏదయినా మార్పు ఉంటుందా అని భారత్‌తో పాటుగా ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు ట్రంప్‌కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండేది.

కానీ ఇప్పుడు కోర్టు కేసులు, విమర్శలు, న్యాయపరమైన చిక్కులు ఇలా అనేక అడ్డంకులు ఎదురైనా ఓడిన చోటే గెలవాలన్న పట్టదలతో అనుకున్నది సాధించిన ట్రంప్ గతానికి భిన్నంగా అమెరికా చరిత్రపై తనదైన ముద్ర ఉండేలా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వివాదాస్పద ప్రకటనలకు భిన్నంగా టారిఫ్‌లు వంటి వాటి విషయంలోనూ పట్టువిడుపులతో వ్యవహరిస్తారని పరిశీలకులు అంటున్నారు.

అయితే వలసల విషయంలో మా త్రం ఆయన తన చేసిన ప్రకటనలకే కట్టుబడి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు హెచ్1బీ వీసాల పట్ల మాత్రం సానుకూల నిర్ణయాలే తీసుకోవచ్చ ని, ఇది భారతీయ టెకీలకు లాభించవచ్చన్న అంచనాలున్నాయి. రెండు దేశాల బంధం ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రష్యాఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని, ప్రపంచ శాంతికి కృషి చేద్దామం టూ స్నేహహస్తాన్ని చాపడాన్ని చూస్తే, తనకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమనే విధంగా ఆయన నిర్ణయాలు ఉండవచ్చని అంటున్నారు. వీటన్నికీ సమాధానాలు లభించాలంటే 78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న ట్రంప్ రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాల కోసం వేచి చూడాలి.