13-02-2025 11:29:22 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): అమెరికాలోని విదేశీయుల పట్ల ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో అక్రమంగా ఉండడంతో పాటు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్నారంటూ వారి చేతులకు, కాళ్లకు ఇనుప సంకెళ్లు వేసి సైనిక విమానంలో అవమానకర పద్దతిలో వారి దేశాలకు తిరిగి పంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు గురువారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ (ఐప్సో) ఆధ్వర్యంలో విదేశీయుల పట్ల అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మానవ హక్కులను అంతర్జాతీయ న్యాయ సూత్రాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐపీఎస్ జాతీయ నేత మాజీ ఎంఎల్ పీస్ ఆవార్డు గ్రహీత కే. యాదవరెడ్డి, ఐప్సో జాతీయ అధ్యక్ష వర్గ సభ్యుడు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, ఏఐపీఎస్‌ఓ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, ప్రధాన కార్యదర్శి జి. నాగేశ్వర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐప్సో నాయకులు మాట్లాడుతూ... అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అంతర్జాతీయ సమాజంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న విదేశీయులు పార్ట్‌టైం ఉద్యోగాలు చేయకూడదని ఆమానవీయ పద్దతుల్లో తిప్పిపంచడం గర్హనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐప్సో రాష్ట్ర నాయకులు ఉమా మహేష్, జే కే. శ్రీనివాస్, పోలగాని రవికిరణ్, కిరణ్, హసన్, నరేంద్ర ప్రసాద్, రజాక్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు.