11-04-2025 08:38:44 PM
ఏరియా జిఎం దేవేందర్...
మందమర్రి (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావ్ పూలే మహిళా విద్య కోసం, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, సకలజనుల సామాజిక న్యాయం కోసం పోరాడారని, సమాజంలో సాంఘిక సమానత్వం సాధించి చూపటమే మహాత్మ జ్యోతిరావ్ పూలేకి నిజమైన నివాళి అని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్ అన్నారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మ జ్యోతిరావ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 150 సంవత్సరాల క్రితమే జ్యోతిరావ్ పూలే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, మహిళల విద్య కోసం అవిశ్రాంతంగా శ్రమించారని, అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా దళితుల తరఫున పోరాడారని వివరించారు. తన భార్య సావిత్రి బాయి పూలేకి స్వయంగా విద్య నేర్పి, మహిళ ఉద్యమానికి నాయకత్వం వహించేలా చేశారని, ఆయన గొప్ప నిస్వార్థ సంఘ సంస్కర్త, మానవతావాది అని ప్రశంసించారు. సనాతన మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలు నడిపారని, అన్ని జాతుల, కులాల వారికి సాంఘిక, ఆర్థిక సమానత్వం కోసం తన జీవితాన్ని ధారపోసారని, ఆయన మహోన్నత సిద్ధాంతాలు మనకు ఆదర్శప్రాయమని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫంక్షన్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కన్వీనర్ ఆఫ్ ది ప్రోగ్రాం, ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు ఎస్ రమేష్, ఈ అండ్ ఎం ఎంజిఎం వై వెంకటరమణ, సివిల్ ఎస్ఈ బి రాము, బీసీ లైసెన్ అధికారి, అడిషనల్ మేనేజర్ ఎండి ముస్తఫా, అడిషనల్ మేనేజర్, బిసి సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు పి రాజు, అడిషనల్ మేనేజర్, బిసి సంఘం ఏరియా కార్యదర్శి పి శ్రీధర్ గౌడ్, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.