చేజేతుల బీజీటీ అప్పగింత
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న ఆసీస్
- మూకుమ్మడిగా విఫలమైన భారత్
- బుమ్రా తప్పా ఎవరూ రాణించని వైనం
- ఐదో టెస్టులోనూ కూడా ఓటమి
- డబ్ల్యూటీసీ అవకాశాలు గల్లంతు
1 - 1996 నుంచి బీజీటీ జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే సిరీస్ డ్రా అయింది.
* గత 4 పర్యాయాలుగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటూ వస్తున్న భారత్‌కు ఈ సారి చుక్కెదురైంది. పెర్త్‌లో మొదలైన పోరు సిడ్నీ ఓటమితో పరిపూర్ణం అయింది. 1-3 తేడాతో ట్రోఫీని కంగారూలకు కోల్పోయారు. ఒక్క బుమ్రా తప్ప మరెవరూ కూడా పెద్దగా రాణించలేదు. ఏ ఒక్కరి వల్లో అని కాకుండా సమష్టి వైఫల్యం వల్లే ఈ దారుణ పరాజయం చోటు చేసుకుందని క్రీడాపండితులు తెలుపుతున్నారు.
విజయక్రాంతి ఖేల్ విభాగం: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకుంది. గడిచిన నాలుగు పర్యాయాలుగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటూ వస్తున్న భారత్ ఈ సారి పేలవ ప్రదర్శనతో ట్రోఫీని ఆసీస్‌కు అప్పగించింది.
కంగారుతో అడుగుపెట్టినా..
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైంది. స్వదేశంలోనే ఓడారు.. ఇక ఆస్ట్రేలియాలో ఏం ఆడుతారులే అని అంతా అనుకున్నా కానీ పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి భారత్‌కు గెలుపు అన్న పదమే వినిపించలేదు.
తర్వాత అడిలైడ్‌లో జరిగిన డే/నైట్ టెస్టు ఓటమితో సిరీస్ 1-1 తేడాతో సమం అయింది. ఆ తర్వాత గబ్బాలో జరిగిన మ్యాచ్‌ను వరుణుడి సాయంతో డ్రాగా ముగించిన భారత్ మరలా మెల్‌బోర్న్‌కు వచ్చేసరికి కంగారూలకు తలవంచి ఓటమిని ఆహ్వానించింది. ఇక చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా బుమ్రా ఆర్మీ ఆసీస్ ముందు తలవంచక తప్పలేదు. దీంతో ఆసీస్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఎనిమిదేండ్లుగా..
గడిచిన ఎనిమిది సంవత్సరాల నుంచి బోర్డర్ ట్రోఫీ భారత్ వద్దే ఉంది. 2016-17లో భారత్ వేదికగా జరిగిన బీజీటీ నుంచి భారత్ జైత్రయాత్ర మొదలైంది. 2-1 తేడాతో ఆనాడు జరిగిన సిరీస్‌లో భారత్ సత్తా చాటింది. ఆనాటి సిరీస్‌లో నయా వాల్ పుజారా (405) పరుగులతో సత్తా చాటగా.. జడేజా 25 వికెట్లు తీసుకున్నాడు. 2018-19, 2020-21 సిరీస్‌లు ఆసీస్ గడ్డ మీద జరిగినా కానీ భారత్ మాత్రం ఆసిరీస్‌ల్లో సత్తా చాటి బీజీటీ ట్రోఫీని తమ వద్దే అట్టి పెట్టుకుంది.
గంభీర్‌కు కష్టాలు?
రాహుల్ ద్రవిడ్ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన గంభీర్ మార్గనిర్దేశకత్వంలో భారత జట్టు మరింత ధృడంగా మారుతుందని అంతా భావించారు. కానీ వరుస పరాజయాలతో గౌతీ కోచింగ్ తీసికట్టుగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా చెడిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
బుమ్రా తప్ప..
ఈ సిరీస్ ఆసాంతం బుమ్రా ఒక్కడు తప్ప మరే భారత ఆటగాడు రాణించిన దాఖలాలు కనిపించలేదు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. ఐదో టెస్టుకు రోహిత్‌ను పక్కన పెట్టారంటేనే పరిస్థితి ఏ విధంగా తయారయిందో అర్థం చేసుకోవచ్చు. టోర్నీ ఆసాంతం బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
అది మిస్సయ్యారా?
సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అంటేనే సీమ్‌కు పెట్టింది పేరు. అటువంటిది భారత్ మాత్రం ఆడిన ఐదు టెస్టుల్లో కూడా ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగింది. నాలుగో పేసర్ ఉండి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని అంతా భావించారు. నితీశ్‌రెడ్డి జట్టులో ఉన్నా అతడిని ఫుల్‌టైమ్ సీమర్‌గా భావించలేం.
సన్నీ లేకుండానే..
సిరీస్ పేరు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. కానీ సిరీస్ ప్రజెంటేషన్ సమయంలో మాత్రం సునీల్ గవాస్కర్ లేకుండానే కేవలం బోర్డర్ చేతుల మీదుగానే సిరీస్‌ను అందించారు. దీనిపై సన్నీ స్పందిస్తూ.. ‘నేను భారతీయుడిని కదా.. అందుకే పిలవలేదేమో. దాని గురించి తనకు ఏం బాధ లేదు. కానీ పిలిస్తే బాగుండేది’ అని తెలిపాడు. ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో గవాస్కర్ గ్రౌండ్‌లోనే ఉండడం గమనార్హం.
డబ్ల్యూటీసీ చాన్స్ మిస్..
వరుసగా మూడో ఏడాది కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలని భావించిన భారత్ కు భంగపాటు తప్పలేదు. సిడ్నీ టెస్టులో ఆసీస్ విజయం సాధించడంతో ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే సౌతాఫ్రికా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోగా.. ఈ గెలుపుతో ఆసీస్ మరో బెర్తును దక్కించుకుంది.