calender_icon.png 10 March, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంప ముంచిన పెట్రోలు ఉపాయం

09-03-2025 07:05:07 PM

కట్టుకున్న భార్య మృతి..

కామారెడ్డి జిల్లాలో విషాదం..

కామారెడ్డి (విజయక్రాంతి): ఓ వ్యక్తి బైక్ నుంచి చోరీకి గురవుతున్న పెట్రోల్ ను కాపాడుకునేందుకు ప్రయత్నించి ఓ ఉపాయాన్ని పాటించాడు. ఆ ఉపాయమే అతని భార్య మృతికి కారణమైంది. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం సీతారాం పల్లిలో ఈ ఘటన జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ద్విచక్ర వాహనం నుండి దుండగులు పెట్రోల్ దొంగతనం చేస్తున్నారని ఓ వ్యక్తి కాస్త ఉపాయంగా ఆలోచించాడు. ఇందుకోసం ఏకంగా తన ద్విచక్ర వాహనంకి కరెంట్ షాక్ పెట్టాడు. తీరా ఉపాయమే అతని కొంపముంచింది. కట్టుకున్న భార్యను బలితీసుకుంది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. 

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం, సీతారాంపల్లి గ్రామంలోని రాజనర్సుకి చెందిన ద్విచక్ర వాహనం టీవీఎస్ ఎక్సెల్ నుండి కొద్ది రోజులుగా గుర్తుతెలియని దుండగులు రాత్రి సమయంలో పెట్రోల్ దొంగలిస్తున్నారు. దీంతో పెట్రోల్ కాపాడుకునేందుకు రాజనర్సు ఉపాయం చేశాడు. గురువారం రాత్రి తన వాహనానికి కరెంట్ షాక్ పెట్టి పక్కనే గల రేకుల షెడ్డులో పార్కింగ్ చేసి ఉంచాడు. కాగా.. అదే షెడ్ లో భార్య రాధిక వంట చేస్తుండగా గమనించకుండా టీవీఎస్ వాహనాన్ని తాకింది.

దీంతో కరెంట్ షాక్ తగిలి ఒక్కసారిగా అపస్మార్క స్థితిలోకి వెళ్ళింది. వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాధిక మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. రాధిక మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త రాజనర్సు ఫిర్యాదు మేరకు బిబిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.