18-04-2025 12:50:05 AM
ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): పాతతరం గిరిజనుల ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు,150 సంవత్సరాల ముందు వారి జీవనశైలి కట్టుబాట్లు నేటి తరానికి తెలియజేసే విధంగా రూపొందించిన గిరిజన మ్యూజియంను భక్తులకు, పర్యాటకులకు తెలియజేసి, వారు మ్యూజియమును సందర్శించే విధంగా ఆటో డ్రైవర్లు ప్రత్యేక బాధ్యత తీసుకొని మ్యూజియం అభివృద్ధికి వంతు సహకారం అందించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
గురువారం ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో భద్రాచలంలోని ఆటో రిక్షా యూనియన్ లీడర్లు, డ్రైవర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి కొన్ని సూచనలు ఇస్తూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులు పర్యాటకులు తప్పనిసరిగా పర్ణశాల, పాపికొండలు చూడడానికి వెళ్లడానికి మొగ్గుచూపుతారని అంతకంటే ముందు గిరిజన సాంప్రదాయాలతో నెలకొల్పిన ట్రైబల్ మ్యూజియం చూసే విధంగా భక్తులకు తెలియజేయాలని అన్నారు.
ట్రైబల్ మ్యూజియంలో పాత తరం కళాఖండాలతో పాటు వారి వ్యవసాయ పద్ధతులు, గిరిజన వంటకాలు, పాతకాలపు ఇండ్లు వెదురుతో తయారుచేసిన వివిధ కల్చర్ కు సంబంధించిన బొమ్మలు, పెయింటింగ్ చిత్రాలు అన్ని మ్యూజియంలో ఏర్పాటు చేశామని అన్నారు.
గిరిజన కల్చర్ను అంతరించిపోకుండా ముందు తరానికి తెలిసే విధంగా అన్ని మౌలిక వసతులతో పాటు చిన్నపిల్లలకు క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులు, పాత తరం గిరిజనులు వేటాడే విల్లంబులతో ఆర్చరీ, నేటితరం యువకులు ఇష్టంగా ఆడుకునే బాక్స్ క్రికెట్, బీచ్ వాలీబాల్ గ్రౌండ్ ఏర్పాటు చేశామని, మ్యూజియంను వేరే రాష్ట్రాల నుండి వచ్చేవారు మ్యూజియంను సందర్శించి వారి కల్చర్ యొక్క సారాంశాన్ని తెలుసుకొని పాతతరం గిరిజన వంటకాలు తనివి తీర చెవి చూసి సంతోషంగా వెళ్లేలా సంబంధిత ఆటో డ్రైవర్లు గురుతర బాధ్యత తీసుకోవాలని, మ్యూజియం సందర్శించడానికి వచ్చే పర్యాటకుల వద్ద అధిక రేట్లు వసూలు చేయకుండా నామమాత్రం రేట్లు తీసుకొవాలని అన్నారు.
అనంతరం గిరిజన మ్యూజియం నకు సంబంధించిన వాల్ పోస్టర్లు, స్టిక్కర్లు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజు తో పాటు ఐటీడీఏ యూనిట్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు అందించి ఆటోరిక్షా లకు స్టిక్కర్లు అంటించారు.ఈ కార్యక్రమంలో ఏవో సున్నం రాంబాబు, భద్రాచలం ట్రాఫిక్ ఎస్‌ఐ మధు, మేనేజర్ ఆదినారాయణ, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, ఐటీడీఏ కార్యాలయం సిబ్బంది ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.