- సంభాల్ ఘర్షణలపై సుప్రీంకోర్టు ఆదేశాలు
- ట్రయల్ కోర్టు ఆదేశాలను అలహాబాద్ కోర్టులో సవాల్ చేయాలని సూచన
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఉత్తరప్రదేశ్ సంభాల్‌లోని మసీదు విషయంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ కోర్టు లో సవాలు చేయాలని సంభాల్ మసీదు మేనేజ్‌మెంట్ కమిటీకి సుప్రీంకోర్టు చూచించింది. అలాగే ఈ వ్యవహారంపై అలహాబాద్ కోర్టు తగిన ఆదేశాలు జారీ చేసేవరకూ తదుపరి విచారణను నిలిపివేయాని ట్రయల్ కోర్టును శుక్రవారం ఆదేశించింది.
సంభాల్‌లోని షాహీ ఇద్గా మసీదు ప్రాంతంలో గతంలో హిందూ దేవాలయం ఉందని కొందరు పిటిషనర్లు కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై నవంబర్ 19న విచారణ జరిపిన ట్రయల్ కోర్టు మసీదు ప్రాంతంలో సర్వే చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు సర్వే చేసేందుకు వెళ్లగా అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే మసీదు మేనేజ్ మెంట్ కమిటీ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం ట్రయల్ కోర్టు ఆదేశాలను అలహాబాద్ కోర్టులో సవాలు చేయాలని సూచించింది. అలాగే శాంతి, సమగ్రతలను పరిరక్షించాలనీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశించింది. మసీదు ప్రాంతంలో చేసిన సర్వేకు సంబంధించిన సమాచారాన్ని సీల్డ్ కవర్లో భద్రపరచాలని అధికారులకు సూచిస్తూ తదుపరి విచారణను 2025 జనవరి6కు వాయిదా వేసింది.