ఇద్దరు నిందితుల అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు నష్ట పోయి ఇద్దరు వ్యక్తులు చోరీల బాట పట్టా రు. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏసీపీ కేపీవీ రాజు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వూటుకూరి ప్రభాస్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్ పేట్‌లో ఉంటున్నాడు.
ఓ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఆన్‌లైన్ బెట్టిం గ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడు. వాటిని తీర్చేందుకు తనకు సోషల్‌మీడియాలో పరిచయమైన నల్గొండ జిల్లా శాలిగౌరారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి శివతో కలిసి చోరీలకు పాల్పడడం ప్రారంభించాడు.
అలా అనేక చోట్ల వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీనిలో భాగంగానే ఈ నెల 10న కందుకూర్ మండలం ఆకులమైలారం గ్రామంలో రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఇంట్లో ఉన్న దేవరశెట్టి సుమతమ్మ అనే వృద్ధురాలి మెడ నుంచి 2 తులాల పుస్తెల తాడు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులను అపహరించి ఉడాయించారు.
బాధితురాలు హైదరాబాద్‌లోని గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా విడిపోయి మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో నిందితులు ప్రభాస్, శివను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు కారు, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. వారికి రివార్డ్ అందజేశారు.