calender_icon.png 19 October, 2024 | 5:29 PM

ద్విచక్ర వాహనాలను పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు

19-10-2024 03:14:58 PM

ఖమ్మం, (విజయక్రాంతి): వాహనాలకు రిజిస్ట్రేషన్, నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా వుండాలని, లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో నగరంలో నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 55 ద్విచక్ర వాహనదారులతో ఏసీపీ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్, దొంగతనాలు చేసే నిందుతులు పోలీసుల నుండి సీసీ కెమెరాల నుండి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనాల నెంబరు ప్లేట్ లను తొలగిస్తున్నారని అన్నారు. అదేవిధంగా చోరి చేసిన వాహనాలతోనే ఎక్కువ నేరాలు చేస్తున్నారని పెర్కోన్నారు.

దొంగిలించిన వాహనాలు నకిలీ పత్రాలు సృష్టించి తక్కువ ధరలకు విక్రయిస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా వ్యక్తులు వాహనాలు కొనుగోలు, అమ్మకాలు చేసినట్లతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ మార్పు చేసుకోవాలని లేదంటే ఎదైనా నేరాలలో మీ వాహనాలు వున్నట్లు గుర్తిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి జరిమానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ ను వంచినా, ముసుగు వేసినా, పూర్తిగా లేకుండా చేసిన వారని గుర్తించి వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు ఆవుతాయని అన్నారు.

ప్రస్తుతం నంబర్ లేకుండా పట్టుబడిన వాహన పత్రాలు, చాయిస్ నెంబర్లు తనిఖీ చేస్తూ.. చోరికి గురైన వాహనాలు ఏమైనా వున్నాయో లేదో ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తునట్లు తెలిపారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ పై మరింత  దృష్టి పెట్టమని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా ఎంవీ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని, ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే జైలు శిక్ష, లేదా జరిమానా ఉంటుందన్నారు. ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు, ఆర్ ఐ సాంబశివరావు ఎస్సై రవి, సాగర్, రాము పాల్గొన్నారు.