కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
రూ.1.70కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగూడెం పట్టణం మెరిసేలా.. ఇక్కడి ప్రజలు మురిసేలా అభివృద్ధి చేసి మరింత స్పూర్తితో ముందుకు సాగుతానని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 16, 18, 21, 22వ వార్డులో రూ.1.70 కోట్ల డిఏంఎఫ్ నిధులతో చేపట్టనున్న నిర్మాణం పనులకు శంకుస్థాపన, 17, 19వార్డుల్లో రూ.2.20కోట్లతో పూర్తయిన నిర్మాణాలను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ.. ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక ద్రుష్టి సారించామని, ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని 36వార్డుల్లో వివిధ పథకాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు, విద్యుత్ వంటి అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నామని, ప్రజలకు గెలుపు ఫలాలు అందించడమే లక్షంగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. నిర్లక్ష్యానికి గురైన కొత్తగూడెం నియోజకవర్గాన్ని మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తున్నామని, విద్య, వైద్యం, విద్యుత్, రవాణా సౌకర్యం అంశాలపై ప్రేత్యేక దృష్టి సారించామన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజలు దృష్టి సారించాలని, అధికారులు పనులను నిత్యం పర్యవేక్షించాలని, నాణ్యత లోపిస్తే చర్యలకు సిఫారసు చేస్తానని, సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కమిషనర్ శేషాంజన్ స్వామి, డిప్యూటీ తహసీల్దార్ అంజద్ పాషా, డి ఈ రవికుమార్, సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్, విద్యుత్ శాఖ అధికారులు, కౌన్సిలర్లు మాచర్ల రాజకుమారి, జి.కళ్యాణి, తదితరములు పాల్గొన్నారు.