calender_icon.png 31 March, 2025 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా కోరల్లో పులివారి చెరువు

29-03-2025 02:40:31 AM

చెరువు శిఖం భూమిలో యథేచ్ఛగా వ్యవసాయం

ఎఫ్టీఎల్ పరిధిలో చదును చేసి వ్యవసాయం చేస్తున్న బాడాబాబులు

పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు

సూర్యాపేట, మార్చి28 (విజయక్రాంతి) :  సాగునీటి వనరుల్లో ప్రధానమైన చెరువులు, కుంటలు, శిఖం భూములు కబ్జాకోరల్లో చిక్కుకుంటున్నాయి. వందల ఏళ్లుగా సాగుకు ఆధారంగా ఉన్న చెరువులు, కుంటలు ఆక్రమణకు గురై పూర్వ రూపురేఖలను కోల్పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక చెరువులు కనుమరుగైనాయి.

కాగా సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ గ్రామ రెవెన్యూ శివారులోని కర్కాయలగూడెం పరిధిలో ఉన్న పులివారి చెర్వు  సంబంధితశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాకు గురి కాగా గ్రామస్థులు కొందరు విజయక్రాంతిని కలిసి తమ చెరువును అక్రమార్కుల చెరనుంచి విడిపించాలని కోరారు. 

చెరువు హద్దులు దాటి సాగు చేసి...

జిల్లాలో పలు మండలాలలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేవి. వర్షాలు కురవకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ ద్వారా నీటిని నింపేవారు. అయితే  కొన్ని చెరువులలో ఎఫ్టీఎల్ పరిధిలోని పట్టా భూముల్లో ఏక ఫసల్, దో ఫసల్ కింద రైతులు పండిస్తుంటారు. అయితే మోతే మండలం ఉర్లుగొండ రెవెన్యూ పరిదిలో సర్వే నెంబర్ 547లో 66.22 ఎకరాల విస్తీర్ణలో పులివారి చెరువు ఉన్నది.

ఈ చెరువులో ఏలాంటి పట్టాలు మంజూరు చేయనట్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం స్పష్టమవుతున్నది. కాగా కొందరు రైతులు చెరువులోని మట్టిని ఎఫ్టీఎల్ లోపలికి పోస్తూ క్రమక్రమంగా ఆక్రమించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో చెరువు శిఖంను గుర్తిస్తూ అధికారులు హద్దులను ఏర్పాటు చేశారు.   అయితే హద్దు రాళ్లను దాటి చెరువు భూమిని చదును చేసి వ్యవసాయ చేస్తున్నట్లు అక్కడ చూస్తే స్పష్టంగా అర్ధమవుతున్నది. 

చెరువు చుట్టూ ఉన్న కొందరు రైతులు కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారని,  ఇప్పటి వరకు సుమారు 50 ఎకరాల  మేర చెరువు శిఖం కబ్జాకు గురైనట్లు వారు ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి దశల వారీగా సాగుతున్న ఈ తతంగం పై అధికారులకు పట్టించుకోవడం లేదంటున్నారు. 

అధికారుల మధ్య సమన్వయ లోపం..

పులివారి చెరువు మీదే ఆధారపడి కొందరు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కబ్జాదారుల వల్ల ఇప్పుడు వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన ఆక్రమణదారులు యథేచ్ఛగా ఎఫ్టీఎల్ పరిధిలో కబ్జాకు పాల్పడుతున్నారు. చెరువుల రక్షణ, బాధ్యత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలదే అయినప్పటికీ చర్యలు శూన్యంగా మారాయి. .

ఇప్పటికైనా కబ్జాకు గురవుతున్న పులివారి చెరువు భూములు వాస్తవంగా ఎంత ఉన్నాయో గుర్తించి సర్వే చేసి హద్దులను నిర్ణయించి రికార్డుల పరంగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఇంచార్జ్ తహసీల్దార్  శ్రీకాంత్,ఇరిగేషన్ ఏఈ లింగయ్య లను  వివరణ కోరగా చెరువు శిఖం భూములను కబ్జాకు గురైనట్లు మా దృష్టికి రాలేదని తెలిపారు. విచారణ చేస్తామని వివరించారు. 

చెరువు భూములను కాపాడాలి.. 

ఉర్లుగొండ రెవెన్యూలో ఉన్న పులివారి చెరువు రికార్డుల ప్రకారం 66 ఎకరాలుగా చూపుతున్నది. కాని క్షేత్రస్థాయిలో పది ఎకరాలకు లోపే ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుకు హద్దులు వేసిన కొందరు హద్దులను దాటి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో ఇక్కడ రైతులు కనీసం పశువులను మేపుకునే అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి చెరువు భూములను కాపాడాలి. 

  1.  కటికం శ్రీనివాస్‌గౌడ్