ఇంకా కన్నాల అడవుల్లోనే..
స్పష్టం చేస్తున్న నిఘా నేత్రాలు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఐదు రోజులుగా బెల్లంపల్లి ప్రాంత ప్రజలను పులి భయం వీడటం లేదు. తిర్యాణి అడవుల గుండా కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతానికి చేరుకున్న బీ2 పెద్దపులి అక్కడే సంచరిస్తుండడం భయం కలిగిస్తుంది. ఈ నెల 1న కన్నాల అటవీ ప్రాంతంలో అడవి పందిపై దాడి చేసి తిన్న పెద్దపులి మళ్లీ ఈనెల 2న సాయంత్రం అడవి పంది కళేబరాన్ని ఈడ్చుకుంటూ మట్టి రోడ్డు దాటి పత్తి చేనులోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు చీకటి సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు కానప్పటికీ పులి కదలికలను మాత్రం పసిగట్టగలిగాయి. దీంతో పులి ఎక్కడైతే అటవీ సిబ్బందికి మొదటిసారిగా కనిపించిందో అదే ప్రాంతంలో మకాం వేసి ఉంటున్నట్లు స్పష్టమవుతుంది. ఆహారంతో పాటు సమీపంలోనే నీటి వసతి ఉండడంతో అదే ప్రాంతాన్ని ఎంచుకొని పెద్దపులి అడవిలో సంచరిస్తున్నట్లు అటవీ సిబ్బంది సేకరిస్తున్న సమాచారం ద్వారా స్పష్టమవుతుంది.