హైడ్రా కమిషనర్ రంగనాథ్
పటాన్‌చెరు, ఆగస్టు 14: చెరువులు, కుంటలను కబ్జా చేయాలనే ఆలోచన వస్తే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టాలని, అంతర్జాతీయ జీవవైవిధ్య సరస్సుగా పేరొందిన అమీన్‌పూర్ పెద్ద చెరువును కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి కాపాడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు, వాణి నగర్ కొత్త చెరువు, బంధం కొమ్ము చెరువులను ఆయన బుధవారం పరిశీలించారు.
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్, శిఖం భూముల పరిధిలో చేపడుతున్న అనుమతి లేని నిర్మాణాలను పరిశీలించారు. పెద్ద చెరువు తూము, అలుగులను మూసివేయడం పట్ల ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు నీటిని ఏ విధంగా బయటకు పంపిస్తారని ప్రశ్నించగా.. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన ఇరిగేషన్ డీఈ రామస్వామిపై అసహనం వ్యక్తం చేశారు.