calender_icon.png 16 January, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడో పెద్ద బ్యాంక్ బీవోబీ

15-09-2024 12:00:00 AM

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎస్బీఐ తర్వాతిస్థానంలో, మొత్తం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మూడోస్థానంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాను (బీవోబీ) బరోడా మహారాజు సయాజీ రావు గైక్వాడ్ 3 అప్పటి బ్యాంకింగ్ పరిశ్రమలో ఉద్దండులైనవారితో కలిసి 1908 జూలై 20 నెలకొల్పారు. రెండేండ్ల తర్వాత బీవోబీ తొలిశాఖను ఆహ్మదాబాద్‌లో ప్రారంభించి క్రమేపీ దేశావ్యాప్తంగా శాఖల్ని విస్తరించింది.

1953లోనే విదేశాల్లో సైతం శాఖల్ని నెలకొల్పడం ప్రారంభించింది. 2969లో కేంద్ర ప్రభుత్వం బీవోబీతో సహా 14 ప్రధాన ప్రైవేటు బ్యాంక్‌ల్ని జాతీయం చేయడంతో అప్పటి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ల సంఖ్యను తగ్గించే క్రమంలో కేంద్రం ప్రతిపాదించిన విలీన ప్రక్రియలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరో రెండు ప్రభుత్వ బ్యాంక్‌లు దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లను విలీనం చేశారు. 2019లో  ఈ విలీనంతో రూ.14.82 లక్షల కోట్ల బ్యాలెన్స్‌షీట్‌తో దేశంలో మూడో పెద్ద బ్యాంక్‌గా (ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత) బీవోబీ ఆవిర్భవించింది. 

1.65 కోట్ల ఖాతాదారులు.. రూ.16.55 లక్షల కోట్ల ఆస్తులు

ఐదు ఖండాల్లో 17 దేశాలకు విస్తరించిన బీవోబీకి 2024 జనవరినాటికి 1.65 కోట్లకుపైగా ఖాతాదారులున్నారు. ఈ బ్యాంక్ ఆస్తు ల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.16.55 లక్షల కోట్లు దాటాయి. దేశవ్యాప్తంగా 9,600కు పైగా శాఖలు, 85,000 మందికిపైగా ఉద్యోగులతో బీవోబీ బ్యాంకిం గ్ సర్వీసుల్ని అందిస్తున్నది. 10,000కు పైగా ఏటీఎంలను ఏర్పాటుచేసింది. ఈ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 63.97 శాతం వాటా ఉన్నది. బీవోబీకి ప్రస్తుతం  హష్ముక్ ఆదియా చైర్మన్‌గా, దేబదత్త చంద్ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 

విస్తరించిన వ్యాపారాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా సాంప్రదాయక రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్‌లతో పాటు క్రెడిట్ కార్డ్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఇన్సూరెన్స్ తదితర విభాగాల్లోకీ విస్తరించింది. 

ఆధునిక బ్యాంకింగ్ బాటలో...

ఫైనాన్షియల్ రంగంలో వచ్చిన వినూత్న మార్పులకు అనుగుణంగా బీవోబీ తనను తాను మలుచుకున్నది. ఆధునిక బ్యాంకింగ్ సర్వీసుల్ని అందించేదిశగా డిజిటల్ బ్యాం కింగ్ సొల్యూషన్స్‌పై దృష్టిపెట్టి యువ ఖాతాదారుల్ని ఆకర్షించగలుగుతున్నది. మొబైల్ బ్యాంకింగ్ కోసం బ్యాంక్ ప్రవేశపెట్టిన బీవోబీ వరల్డ్  యాప్ విస్త్రత ప్రాచుర్యం పొందింది.

మార్కెట్ విలువ రూ.1.23 లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే బ్యాంక్ ఆఫ్ బరోడా  ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.23 లక్షల కోట్లు. గడిచిన మూడేండ్లలో బీవోబీ షేరు ఇన్వెస్టర్లకు 200 శాతం రాబడిని ఇచ్చింది.