calender_icon.png 17 November, 2024 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వస్త్ర పరిశ్రమ ప్రపంచంతో పోటీపడాలి

17-11-2024 03:52:02 AM

సిరిసిల్లకు రూ.66 లక్షల ఆర్వీఎం క్లాత్ ఆర్డర్

-80 శాతం క్రెడిట్‌పై యారన్ అందిస్తాం

జౌళిశాఖ ముఖ్య కార్యదిర్శి శైలజా రామయ్యర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సిరిసిల్ల, నవంబర్ 16 (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రపంచ మార్కెట్‌తో పోటీపడాలి తప్పా నేతన్నలు ఆత్మహత్య చేసుకోవద్దని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జౌళిశాఖ ముఖ్య కార్యదిర్శి శైలజా రామయ్యర్ సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్థితిగతులపై కలెక్టర్‌లో యజమానులు, ఆసాములతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్వీఎంకు సంబంధించి రూ.66 లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇస్తున్నామన్నారు.

అన్ని ప్రభుత్వ శాఖలకు కావాల్సిన క్లాత్‌ను ఆర్డర్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళ సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇవ్వనున్నట్టు తెలిపారు. వీటికి సంబంధించిన డిజైన్లు పూర్తి అయ్యాయని, త్వరలో ఆర్డర్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం యారన్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు.

80 శాతం క్రెడిట్‌పై యారన్ అందజేస్తామని తెలిపాఉ. టెస్కో ఆధ్వర్యంలో క్లాత్ సేకరిస్తామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీ అంశం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో చర్చిస్తామని ప్రకటించారు. అనంతరం శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల వరకు నేతన్నలకు ఉపాధి కల్పించేందుక ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. మిగితా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్‌లో ఉపాధి పొందేలా ఆలోచన చేయాలన్నారు.

త్వరలోనే హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. యారన్ బ్యాంక్‌ను నేతన్నలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కాంక్షించారు. సమావేశంలో కలెక్టర్  సందీప్‌కుమార్ ఝా, డిప్యూటీ కల్టెకర్ ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయల సంస్థ చైర్మన్ నాగు సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపరెడ్డి, టెస్కొ జీఎం అశోక్‌రావు, హ్యాండ్లూం అండ్ టెక్స్‌టైల్స్ ఏడీ సాగర్ పాల్గొన్నారు.