26-04-2025 12:00:00 AM
సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్
అశ్వాపురం, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి ) :కాశ్మీర్ లోని పహల్గామ్ లో పోలీస్ వేషంలో వచ్చి విచక్షణారహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని అశ్వాపురం మండలం సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు అనంతనేని సురేష్ అన్నారు .అశ్వాపురం సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఘటనలో మరణించిన పౌరులకు శుక్రవారం నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ సామాన్య పౌరులపై ఉగ్రవాదులు దాడులు హేయమైన చర్య అని అన్నారు. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో అలజడి సృష్టించడమే పాక్ ప్రధాన ఉదేశ్యమని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం చెందిందని వారు ధ్వజమెత్తారు.కాశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన జిహాదీ పాక్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను గుర్తించి అంతమొందించాలని డిమాండ్ చేశారు.
ఉగ్రదాడికి కారణమైన పాక్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలని,వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా పౌరులపై జరిగిన ఉగ్ర దాడులను చూస్తే 370 ఆర్టికల్ రద్దు చేస్తే కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఉంటుందన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు.
ప్రస్తుతము అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారతదేశంలో పర్యటన జరుపుతున్న ఈ సందర్భంలో ఇలాంటి అమాయకుల పైన దాడి చేసి కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చేయాలని కుట్రలో భాగమే ఈ దాడి అని వారు అన్నారు.కాశ్మీర్ మొత్తం ప్రజలు కూడా ఈ బుద్ధిహీన హింసకు బాధితులని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశ ప్రజలతో పాటు నిలబడాలన్నారు.
ఈ క్లిష్టమైన క్షణంలో, భారతదేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని తాము పిలుస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్, సిపిఐ సహాయ కార్యదర్శులు మేలపుర సురేందర్ రెడ్డి,ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహకార కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి, ఏఐఎస్‌ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి అక్కినపల్లి నాగేంద్రబాబు,హేమంత్, పాల్గొన్నారు.