- కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే ఎలా?
- తెలంగాణ ఉద్యమం తరహాలో పోరుకు ప్లాన్
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : గులాబీ శ్రేణుల్లో కేటీఆర్ అరెస్టు టెన్షన్ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్, ఈ-ఫార్ములా కారు రేసింగ్‌లో అరెస్టు తప్పినా, లగచర్ల దాడి ఘటనలో సూత్రధారి కేటీఆరేనని రిమాండ్ రిపోర్టులో చేర్చడంతో ఐదారు రోజుల్లో అరెస్టు తప్పదంటున్నారు.
రెండు రోజుల కిందట తెలం గాణ భవన్‌లో సీనియర్లతో కేటీఆర్ సమావేశమై తనను అరెస్టు చేస్తే అనుసరించాల్సిన వ్యుహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రేవంత్ సర్కార్ 11 నెలల పాలనలో చేసిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగట్టేందుకు అవసరమైన వివరాలను సేకరిం చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అదేవిధంగా హైడ్రా, మూసీ బాధితులతో కలిసి ఉద్యమించి రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం చేస్తుందని.. ముచ్చర్ల ఫార్మాసిటీ సమీపంలో రైతులను బెదిరించి సీఎం సోదరులు భూములు తీసుకున్నారనే విషయాలను ప్రచారం చేసేందుకు వ్యుహాలు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రభుత్వంపై పోరు!
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన విధంగానే.. రేవంత్ సర్కార్ ద్వంద్వ విధానాలను ఎండగట్టాలని ఊరుఛె కదిలేలా కళాకారులను సిద్ధం చేయాలని చర్చించినట్టు తెలుస్తున్నది. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తమకు మరింత అనుకూలంగా మార్చుకునేందుకు కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్ని రోజులు జైల్లో ఉంటే అన్ని రోజులు నిరసనలు చేపట్టేలా ప్రణాళికలు రూపొంది స్తున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ అరెస్టును రాజకీయంగా వాడుకోవాలని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివ రించి కాంగ్రెస్‌ను ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని బీఆర్‌ఎస్ స్కెచ్ వేస్తున్నది. కార్యకర్తలపై కేసులు పెడితే వెంటనే బెయిల్‌పై తీసుకొచ్చేలా న్యాయవాదులకు ప్రత్యేక నిధులు కేటాయించి వారితో చర్చింటినట్టు సమాచారం.
సీఎం రేవంత్ తన గురువు చంద్ర బాబు విధానాలనే అనుసరిస్తున్నాడని, గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంతో పగ తీర్చుకునేందుకు ప్లాన్ చేశారని ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆరు గ్యారెంటీలపై గ్రామాల్లో సభలు
ఆరు గ్యారెంటీలపై గ్రామాల్లో సభలు నిర్వహించాలని, రైతు భరోసా ఎగనామం, రైతు భీమా, వృద్ధులకు రూ.4వేల పింఛన్, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం వంటి విషయాల్లో వైఫల్యాలను ప్రజలకు వివరించేలా గ్రామ కమిటీలకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సందడిగా మారిన తెలంగాణ భవన్..
కొడంగల్ దాడి తర్వాత తెలంగాణ భవన్ కార్యకర్తలతో సందడిగా మారింది. కేటీఆర్‌ను కలిసేందుకు కార్యకర్తలు వందలాదిగా తరలివస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తమ అనుచరులతో తెలంగాణ భవన్‌కు వచ్చి కేటీఆర్ రాక కోసం గంటల తరబడి వేచిచూస్తున్నారు. రేవంత్ కుట్రలను తిప్పికొట్టేందుకు తామం తా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.