calender_icon.png 12 January, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీర్జాదిగూడలో ఉద్రిక్తత

09-07-2024 01:01:51 AM

రసాభాసగా మారిన ఇళ్ల కూల్చివేత 

  1. అడ్డుకున్న మేయర్, కార్పొరేటర్లు 
  2. మేయర్‌ను కిందపడేసి కార్పొరేటర్లను నిర్బంధించిన పోలీసులు 
  3. రాజకీయ కక్ష సాధింపుతోనే ఇళ్లు కూల్చారన్న మేయర్ జక్కా వెంకట్ రెడ్డి 
  4. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ 
  5. బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి):  మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం ఉదయం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పర్వతాపూర్ సర్వే నంబర్ 1లో మున్సిపల్ అధికారులు ఇండ్లను కూల్చివేశారు. ఈ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ఇళ్లకు సీలింగ్ ఉందంటూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే, నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇక్కడ వందల ఇళ్ల నిర్మాణం జరిగితే కేవలం నాలుగు ఇళ్లను మాత్రమే కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ జక్కా వెంకట్ రెడ్డి.. కార్పొరేటర్లు, స్థానిక ప్రజలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు మేయర్‌ను పక్కకు నెట్టగా కిందపడ్డారు. అనంతరం పోలీసులు కార్పొరేటర్లు కొల్తూరి మహేశ్, బచ్చరాజు, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, ఎంపల్ల అనంత రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు బండారి రవీందర్, లేతాకుల రఘుపతి రెడ్డి, బండి సతీశ్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, రఘువర్దన్ రెడ్డి, జావీద్ ఖాన్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అనంతరం అధికారులు కూల్చివేతలను పూర్తి చేశారు. అయితే, గత ప్రభు త్వ హయాంలోనే సాయిప్రియ, సత్యానారాయణపురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 118 జీవో పరిధిలోకి చేర్చి ప్లాట్ ఓనర్లకు ఈ స్థలాలను కేటాయించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని మేయర్, కార్పొరేటర్లు ఆరోపించారు.  

రాజకీయ కక్ష సాధింపుతోనే: కేటీఆర్ 

పీర్జాదిగూడ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్లాట్లను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులే విక్రయించారని, 2008లో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్లాట్లను ప్రభుత్వమే క్రమబద్ధీకరించినట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇళ్లను కూల్చివేయడంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఏం ఆశించి ఇక్కడి పేదల ఇళ్లను కూల్చివేయిస్తున్నారో అని ప్రశ్నించారు.

ప్రజా పాలన అందిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా అని నిలదీశారు. రెవెన్యూ అధికారులు సైతం పట్టా భూమిగా ఎన్‌వోసీ జారీ చేసినట్టు గుర్తు చేశారు. దీంతో చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఇళ్లను నిర్మించుకున్నారని తెలిపారు. అమాయక ప్రజలు లక్షలు వెచ్చించి నిర్మాణం చేసుకున్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.  

దమ్ముంటే ప్రజా క్షేత్రంలో కొట్లాడుదాం : మేయర్ 

పీర్జాదిగూడలో అవిశ్వాసం నెగ్గకపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి అన్నారు. గతంలో కిడ్నాప్‌లు, తప్పుడు కేసులతో భయపెట్టారని, నేడు అమాయకుల ఇండ్లను కూల్చివేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజా క్షేత్రంలోకి వచ్చి కొట్లాడాలి కానీ దొడ్డి దారిలో ప్రజాప్రతినిధులను భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి అవిశ్వాసం గెలవాలని అనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న హింసను మళ్లీ వడ్డీతో సహా చెల్లిస్తామని, అక్రమ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటూ ప్రజల తరఫున పోరాటం చేస్తామని మేయర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ దుర్మార్గాన్ని అడ్డుకుంటాం: ఎంపీ ఈటల 

అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన, బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పు డు కూల్చేయడం దారుణమన్నారు. అక్రమ భూములు అయితే ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అను మతించారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు పాల్పడడం సబబు కాదని పేర్కొన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం వల్ల 300 మంది రోడ్డున పడ్డారని, ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ విషయంపై మం త్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే స్పందించడం లేదని తెలిపారు.