విద్యార్థి సంఘాల రాకతో ఆందోళన ఉధృతం..
యాజమాన్యం మొండి వైఖరి..
కిటికీ మీద ముద్రలు..
పోలీసుల అదుపులో ఐదుగురు అనుమానితులు..
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల వసతి గృహం వద్ద రెండో రోజు విద్యార్థినుల ఆందోళన కొనసాగింది. బాత్రూంలో వీడియోలు తీస్తున్నారని మొదటి రోజు బుధవారం అర్ధరాత్రి వరకు విద్యార్థినులు ఆందోళన చేశారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. విద్యార్థి సంఘాలు రావడంతో ఆందోళన మరింత ఉదృతమైంది. విద్యార్థి సంఘాల కార్యకర్తలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా గోడ దూకి లోనికి వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు తరగతులు బహిష్కరించి అక్కడే బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు విద్యార్థినులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నాయి. వార్డెన్ ప్రీతి రెడ్డిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
యాజమాన్యం మొండివైఖరి..
విద్యార్థినిలు రెండు రోజులుగా ఆందోళన చేస్తుంటే యాజమాన్యం సకాలంలో స్పందించలేదు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి చెందినది. మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆందోళన ఉదృతం కావడంతో గురువారం సాయంత్రం చైర్మన్ గోపాల్ వచ్చి చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. విద్యార్థినుల భద్రత విషయంలో యాజమాన్యం పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. బీహార్ కు చెందిన వంట మనుషులకు బాత్రూం పక్కనే గదులు కేటాయించారు. ఈ విషయమై పలుమార్లు విద్యార్థినులు వార్డెన్, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై యాజమాన్యం పట్టించుకోలేదు. వార్డెన్ ప్రీతిరెడ్డి తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని విద్యార్థినులు తెలిపారు. ప్రస్తుతం ఆందోళన చేస్తుంటే కాలేజీ సిబ్బంది తమను బెదిరిస్తున్నారని విద్యార్థినిలు తెలిపారు.
కిటికీ మీద ముద్రలు..
బాలికల బాత్రూం వద్ద పైన కిటికీ అద్దాల మీద పేరుకుపోయిన దుమ్ము మీద ముద్రలు కనిపిస్తున్నాయి. ఈ ముద్రలో చేతి ముద్రలేనని విద్యార్థినులు వాదిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలో చేతి ముద్రల కాదా అనేది తేలాల్సి ఉంది.
పోలీసుల అదుపులో ఐదుగురు..
విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు కాలేజీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ సత్యనారాయణ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి కాలేజీకి చేరుకుని పరిశీలించారు. విద్యార్థినిల ఫిర్యాదు మేరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి వద్ద 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వార్డెన్ ప్రీతి రెడ్డిని కూడా విచారించారు.
సుమోటో గా స్వీకరించిన మహిళ కమిషన్..
సీఎంఆర్ బాలికల హాస్టల్ ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళా కమిషన్ సభ్యురాలు పద్మజారమణ హాస్టల్ కు వచ్చి పరిశీలించారు. విద్యార్థినిలతో మాట్లాడి వివరాలు సేకరించారు. సీఎంఆర్ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు. వీడియో రికార్డింగ్ చేసినట్టు తేలితే యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
కేసు నమోదు చేసి విచారిస్తున్నాం.. ఏసిపి శ్రీనివాసరెడ్డి
బాత్రూం వద్ద ఒక వ్యక్తి తాచ్చాడుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు, దరఖాస్తు ఇవ్వమని చెప్పాం, విద్యార్థినుల దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నాం, ఫింగర్ ప్రింట్ టీం ను రప్పించాం. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయించాం. అందులో రెండు చాన్స్ ప్రింట్ వచ్చాయి. ఐదుగురు మీద అనుమానం ఉందని విద్యార్థినులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. నేను కూడా అక్కడ పరిశీలించాను. బాత్రూం పక్కనే రెండు గదులను పనిచేసే వారికి ఇచ్చారు. వారు అక్కడి నుంచి తిరిగి అవకాశం ఉంది. ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసి బ్యూరోకు పంపాము. అనుమానితుల వద్ద 11 ఫోన్ లో స్వాధీనం చేసుకున్నాము. ఫోన్లను మా సిబ్బంది పరిశీలించారు. అందులో వీడియోలు లేవు. డిలీట్ వీడియోలు క్యాట్ కు పంపి ట్రేస్ చేస్తాం, అని ఏసీపీ శ్రీనివాసరెడ్డి వివరించారు.