calender_icon.png 7 October, 2024 | 5:01 AM

కులగణనపై నాణ్చివేత ధోరణి తగదు

07-10-2024 02:35:49 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

ముషీరాబాద్, అక్టోబర్ 6 : (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ కులగణన చేపట్టడం పై నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారపు గణేశా చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నపటికీ కులగణనపై సీఎం కానీ, మంత్రులు కానీ ఎవరూ స్పష్టమైన ప్రకటన చేయడం లేదని మండిపడ్డారు. గత నెల 6న రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని.. కమిషన్ ఏర్పాటు చేసి నెల రోజులు గడుస్తున్నా సమగ్ర కులగణనను చేపట్టేందుకు కార్యచరణ రూపొందించడం లేదన్నారు.

కాగ్రెస్ వైఖరి మారకుంటే మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల సందర్భంగా వేలాది మందితో బహిరంగ సభను నిర్వహించి కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసాలపై ప్రచారం చేస్తామని ఆయన హెచ్చరించారు. రెండు మూడు రోజుల్లో అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాల మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని జాజుల అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకుడు, తెలంగాణ రాష్ట్ర నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకిషన్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు అయిలు వెంకన్న గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు కోల శ్రీహరి, ఎంఎస్ నరహరి, జాజు ల లింగం, గూడూరు భాస్కర్, సత్తయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.