02-03-2025 12:00:00 AM
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని గ్రామం కంకల్. ఈ గ్రామంలో రాష్ర్టకూటశైలి, కాకతీయశైలి జైన, శైవ శిల్పాలు 50కి పైగా వున్నాయి. రెండు కళ్యాణీ చాళుక్యులకాలంనాటి శాసనాలున్నాయి. పదులకొద్ది వీరగల్లులున్నాయి. ఈ వూరిలో ప్రధానాలయం వీరభద్రునిగుడి. కొత్తగా గుడిని పునర్నిర్మాణం చేస్తున్నారు. గర్భగుడిలో వీరభద్ర శిల్పం సుందరమైనది. త్రికోణాకృతి మకర తోరణం వీరభద్రుని తలవెనక అగుపిస్తున్నది.
చతుర్భు జుడైన వీరభద్రుడు పరహస్తాలలో ఢమరుకం, త్రిశూ లాలు, నిజ హస్తాలలో ఖడ్గం, డాలు ధరించి, ద్వి భంగిమలో నిల్చుని కనిపిస్తున్నాడు. పాదాలు అర్థవై తస్తిక స్థితిలో ఉన్నాయి. మెడలో హార, గ్రైవేయకాలు, ఉదరబంధం, మేఖ ల, అర్థోరుకం, చేతులకు హస్తభూషణాలు, పాదాలకు పాంజీబులు, కపాల మాల జంధ్యంగా ధరించి కనిపించే వీరభద్రుని శిల్పం కాకతీయశైలిలో ఉన్నది. వీరభద్రునికి కుడిపక్కన మేషశి రంతో దక్షుని చిన్న శిల్పం వుంది. కుడిపాదం సమీపాన సూక్ష్మ గణపతి శిల్ప ముంది.
గర్భగుడిలో కనిపించే శివలింగం 9 అడుగుల పొడుగైందని, దానికి బ్రహ్మ, విష్ణు, రుద్రభాగాలున్నాయని చెప్పారు. ఈ శివలింగం ఒక సమలింగం. దీనికి ఛత్రోపరితం ఉన్నది కాకతీయశైలి. వీరభద్రుని గుడికి ఉపాలయంగా ద్వాదశభుజురాలైన భద్రకాళి శిల్పం (కొత్తది) ఉన్నది. ఈ గుడి ద్వార శాఖలు రెండు వేర్వేరు. కుడివైపున్న ద్వారశాఖమీద చామరధారిణులతో ద్వారపాలకుడున్నాడు. ద్వారశాఖ మూడు పట్టీలతో చతుర్దళపుష్పం, లతలు, తామరపూరేకులతో వాటి పక్కన స్తంభికతో ఉన్నది. ఎడమవైపు ద్వారశాఖ మీద పెద్ద ధమ్మిల్లంతో కుడిచేత గదవంటి ఆయుధంతో వైతస్తిక(వైష్ణవ)పాదభంగిమలో నిల్చున్న స్త్రీ ద్వారపాలిక ఉన్నది. పక్కన స్తంభిక ఉంది. ద్వారపతంగం మీద లలాటబింబంగా గణపతి ఉన్నాడు.
-శ్రీరామోజు హరగోపాల్