27-03-2025 05:17:34 PM
ఉద్యోగ విరమణ సభలో పిఆర్టియు నేతలు...
కాటారం (విజయక్రాంతి): విద్యార్థులతో పాటు సమాజంలోని వ్యక్తుల వ్యక్తిత్వ వికాసానికి టీచరే మార్గదర్శని పీఆర్టీయూ కాటారం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఆంగోతు రవీందర్, అనపర్తి తిరుపతిలు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంట మండల ప్రజా పరిషత్ ఎస్సీ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు వోల్లాల రాములు, అలాగే మండలంలోని అంకుశాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాలిగపు బిక్షపతి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వారు పాల్గొని ప్రసంగించారు.
విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని వారు ఉద్ఘాటించారు. విద్యార్థులతో పాటు సమాజం మీద ఉపాధ్యాయుని నడక, క్రమశిక్షణ తదితర అలవాట్లు ప్రభావితం చేస్తాయని వారు అన్నారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి తప్పనిసరి అయినప్పటికీ, తన ఉద్యోగ కాలంలో నిర్వర్తించిన బాధ్యతలను, అందించిన సేవలను మరచిపోవద్దని అన్నారు. ఈ సందర్భంగా వోల్లాల రాములు, రాణి దంపతులను అలాగే జాలిగపు బిక్షపతి దంపతులను ఘనంగా శాలువతో సన్మానించారు.
క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి, మంచి నడవడికతో ఉద్యోగ సముపార్జన చేయడంతో పాటు, విద్యార్థులను సమ సమాజ భావి భారత నిర్మాతలుగా తయారు చేయడంలో ఉద్యోగ ధర్మంగా నిర్వర్తించిన సేవలు తమ జీవితకాలం గుర్తు ఉంటాయని ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేస్తున్న ప్రధానోపాధ్యాయులు వోల్లాల రాములు, జాలిగపు బిక్షపతిలు ఇరువురు గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులు ప్రధానోపాధ్యాయులతో మమేకమైన తీరు పలువురిని ఆకర్షింప చేశాయి. ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు భగవాన్ రెడ్డి, దేవి నాయక్, నడిపెల్లి సురేష్ రావు, గణపతి నాయక్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ పాలకవర్గం, విద్యార్థిని, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.