calender_icon.png 5 April, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదలైన సుంకాల యుద్ధం!

05-04-2025 02:38:29 AM

అమెరికా ప్రతీకార సుంకాలపై చైనా కౌంటర్ యాక్షన్‌కు దిగింది. తమ దేశంపై విధించిన సుంకాలకు దీటుగా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై 34 శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు కెనడా సైతం అగ్రదేశంపై సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించేసింది. దీంతో ప్రపంచ వాణిజ్యంలో ప్రతీకార సుంకాల యుద్ధానికి తెరలేచినట్టయింది.  వాస్తవానికి ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సుంకాల వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థకు 30 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అమెరికా ట్రెజరీ మాజీ సెక్రటరీ అంచనా వేశారు.

ఇది అమెరికా ఒక ఏడాది జీడీపీకి సమానం కావడం గమనార్హం. కెనడా మెక్సికో మధ్య కుదిరిన గత ఒప్పందానికి సంబంధం లేకుండా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాహనాలపై 25 శాతం ప్రతీకార సుంకాలను విధించనున్నట్టు కెనడా ప్రకటించింది. యురోపియన్ యూనియన్ కూడా కెనడా, చైనా బాటలోనే పయనించి అమెరికాపై ప్రతీకార సుంకాలను ప్రకటిస్తే దానికి సంబంధించిన పరిణామాలు ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సుంకాల ధాటికి తట్టుకోలేక ఇతర దేశాల నుంచి కొన్ని తయారీ కేంద్రాలు అమెరికాకు తరలిపోయే అవకాశం ఉంది.

బహుశా ట్రంప్ అంతిమ లక్ష్యం కూడా ఇదే కావొచ్చు. కానీ ఇతర దేశాలు తమ వాణిజ్య నిబంధనలను మార్చుకోవడానికి చేసిన కుట్రగా దీన్ని భావిస్తే  ట్రంప్ చర్యలు వ్యర్థమయ్యే అవకాశం లేకపోలేదనే వాదన ఉంది. ట్రంప్ తక్కువలో తక్కువ 10 శాతం సుంకాన్ని ప్రతిదేశంపై విధించారు. ఇది గత ఏడాదితో పోల్చితే సుమారు 7.7 శాతం ఎక్కువ. దీంతో ప్రపంచ దేశాలు సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆయా దేశాలు ఉత్తమ మార్గాలను అన్వేషించి, వాటిని అమలుచేసి ఫలితాలను రాబట్టేందుకు చాలా ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది.

అందువల్ల అప్పటివరకూ అమెరికా సుంకాల భారాన్ని ప్రపంచ దేశాలు మోయక తప్పని పరిస్థితి. భారత్ మాత్రం సుంకాల పరిణామాలను నిశితంగా పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే కాపర్, ఎనర్జీ పరికరాలపై ట్రంప్ టారిఫ్‌లు విధించలేదు. ఫార్మా, సెమీ కండక్టర్ రంగాలపై ట్రంప్ తొలుత టారిఫ్‌లను ప్రకటించనప్పటికీ వాటిపై సుంకాలు విధించే ఆలోచన ఉన్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో కాపర్, ఎనర్జీ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు భారత్‌లో మరింత అభివృద్ధి చెంది, దేశానికి ప్రయోజనం చేకూరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు వాణిజ్యంలో ప్రతీకార సుంకాల యుద్ధం మొదలుకాగా ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల కారణంగా అమెరికాలో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. మార్కెట్లు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే అగ్రరాజ్యంలో సుమారు 2 ట్రిలియన్ల సంపద ఆవిరైనట్టు నివేదికలు చెబుతున్నాయి. కొవిడ్ తర్వాత అక్కడి మార్కెట్లు ఇలా భారీ స్థాయిలో కుదేలవ్వడం ఇదే మొదటిసారి. టారిఫ్‌ల వల్ల అమెరికా వృద్ధిరేటు 2 శాతం తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం  5 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఇటు అమెరికాపైనే కాకుండా ప్రపంచ మార్కెట్లపై కూడా పడింది. స్టాక్ మార్కెట్ల పతనం ద్వారా ఈ సుంకాల యుద్ధం ఎప్పుడూ వాణిజ్యానికి మంచివి కావనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.