పారిస్: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కాంస్య పతక పోరులో నిరాశపరిచాడు. సోమవారం బ్రాంజ్ మెడల్ పోరులో లక్ష్యసేన్ 21 16 11 మలేషియా ఆటగాడు లీ జియా చేతిలో పరాజయం పాలయ్యాడు. 71 నిమిషాల పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వని లక్ష్యసేన్ దూకుడుగా ఆడి తొలి గేమ్ విజయంతో పతకంపై మరింత ఆశలు పెంచాడు. కానీ రెండో గేమ్ నుంచి లక్ష్యసేన్ పూర్తిగా ఒత్తిడికి లోనయ్యాడు. మలేషియా ఆటగాడు లీ జియా కూల్‌గా పాయింట్లు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. దీంతో రెండో గేమ్‌ను లక్ష్య కోల్పోయాడు.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభం నుంచే పేలవ ప్రదర్శన కనబరిచిన లక్ష్యసేన్ తర్వాత కాస్త ఫుంజుకున్నట్లు కనిపించింది. కానీ లీ జియా వేగంగా ఆడి పాయింట్లు సాధించాడు. చివరకు లక్ష్యసేన్ 11 పాయింట్లతో ఉన్నప్పుడు లీ 21 పాయింట్లతో గేమ్ పాయింట్ సాధించి కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు బ్యాడ్మింటన్‌లో కనీసం ఒక్క పతకమైనా వచ్చి చేరింది. 12 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో ఒక్క పతకం కూడా రాకపోవడం గమనార్హం.
సైనా నెహ్వాల్ (2012, కాంస్యం), పీవీ సింధూ (2016 రజతం, 2020 కాంస్యం) నెగ్గారు. కొంతకాలంగా నిలకడగా ఆడుతున్న లక్ష్యసేన్ ఒలింపిక్స్‌లోనూ పతకం దగ్గరి దాకా వచ్చి నిష్క్రమించడం బాధాకరం. 2021 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన లక్ష్యసేన్ 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం విశేషం. అయితే ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరిన తొలి ఆటగాడిగా లక్ష్యసేన్ చరిత్రకెక్కాడు.