- పారా అథ్లెట్లకు వీడ్కోలు కార్యక్రమం
- పతాకధారులుగా సుమిత్, భాగ్యశ్రీ
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ముగిసి ఐదు రోజుల కావొస్తున్న నేపథ్యంలో పారిస్ వేదికగా మళ్లీ క్రీడలు జరగనున్నాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారాలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్య మివ్వనుంది. కాగా భారత్ నుంచి ఈసారి 84 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. 12 క్రీడాంశాల్లో మన అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో భారత పారా అథ్లెట్లకు సంయుక్తంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.కాగా పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్‌లు పతాకధారులుగా వ్యవహరించనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తెలిపింది.
25 పతకాలే లక్ష్యంగా..
గత టోక్యో పారాలింపిక్స్‌లో దేశం తరఫున 54 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగారు. ఐదు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తంగా 19 పతకాలు సాధిం చి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు పీసీఐ వెల్లడించింది. ‘జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని పారా అథ్లెట్లుగా ఎదిగిన మన వీరులు పారిస్‌లో అదరగొట్టాలి. ఇప్పటికే అథ్లెట్లు కఠోర శ్రమ, పట్టుదలతో పారాలింపిక్స్ క్రీడలకు సిద్ధమయ్యారు.
టోక్యో కంటే ఎక్కువ సంఖ్యలో దేశానికి పతకాలు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. అనంతరం అభిషేక్ దూబే, మహవీర్ రావత్‌లు కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది బారియర్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పతకాధారులుగా వ్యవహరించనున్న సుమిత్ అంటిల్ జావెలిన్ ఎఫ్64 కేటగిరీలో టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు. అత్యధికంగా అథ్లెటిక్స్ విభాగం నుంచి ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు.