calender_icon.png 8 January, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ 16 వేల కోట్లు

04-08-2024 03:06:55 AM

ఐటీ, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒప్పందాలు

సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు విదేశీ టూర్లు.. 11 వరకు అమెరికా, దక్షిణ కొరియాల్లో

సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): విదేశీ పర్యటనల్లో చేసుకునే ప్రతిష్ఠాత్మక ఒప్పందాల ద్వారా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గణనీయ ప్రోత్సాహం లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఒక బృందం శనివారం ఉదయం బయలుదేరి వెళ్లగా మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మరో అధికారుల బృందం ఆదివారం అమెరికాకు బయలుదేరుతుంది. సీఎం రేవంత్ నేతృత్వంలో ఈ నెల 4 నుంచి 11 వరకు అమెరికా, దక్షిణకొరియా పర్యటనకు సంబంధించి సమావే శాలు, కార్యక్రమాల ప్రణాళికను శనివారం సచివాలయంలో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ రెండు దేశాల్లో పర్యటనలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో రూ.16 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చే ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పటిష్ఠ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మక కార్యక్రమాలు తెలంగాణకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని వెల్లడించారు. ఈ పర్యటన ఇప్పటికే ఆ దేశాలతో ఉన్న భాగస్వామ్యాలను పటిష్ఠ పర్చడమే కాకుండా కొత్తగా పలు సంస్థలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తాయని ఆకాంక్షించారు. నూతన పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు మార్గదర్శకంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల అధికారుల బృందం గత ఆరునెలలుగా పలు ఒప్పందాలు చేసుకుంది. ప్రస్తుత పర్యటనలో వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.