calender_icon.png 24 January, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతే టార్గెట్

05-07-2024 12:49:10 AM

ఆన్‌లైన్ ట్రేడింగ్

పది రెట్లు ఇస్తామంటూ ఊబిలోకి లాగుతున్న ముఠాలు

  1. విదేశీ టూర్లంటూ ఆకర్షించి మోసం 
  2. జగిత్యాల జిల్లాలో జోరందుకున్న వ్యాపారం

ఆశతో దాదాపు 900 కోట్ల పెట్టుబడులు పెట్టిన యువత 

చివరికి డబ్బులు రాక, అప్పులతో పాట్లు

జగిత్యాల, జూలై 4 (విజయక్రాంతి): కష్టపడకుండా రాత్రికి రాత్రే కోటీశరులైపోవాలని భావించే యువతే టార్గెట్‌గా జగిత్యాల జిల్లాలో ఆన్‌లైన్ వేదికగా పెట్టుబడుల వ్యాపారం జోరుగా నడుస్తున్నది. యువత కలలను నిజం చేసుకు నేందుకు సహకారం అందిస్తామంటూ జిల్లాలో కొన్ని ముఠాలు బయలు దేరాయి. రూ.లక్ష పెడితే పది లక్షలు, రూ.పది లక్షలు పెడితే రూ.కోటి సంపాదించుకోవచ్చంటూ ఆశల పల్లకీలోకి నెడుతున్నాయి. దేశవిదేశాలకు ట్రిప్‌లు వెళ్లొచ్చంటూ నమ్మిస్తున్నాయి. సంపాదించుకొనే సదవకాశాన్ని పోగొట్టు కోవద్దంటూ వ్యాపారులు నమ్మబలుకుతుండడంతో నమ్మిన యువత దాదాపు రూ.900 కోట్ల వరకు ఆన్‌లైన్ వేదికగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. 

చైన్ సిస్టం.. కమీషన్ల పేర దందా

రూ.లక్ష పెడితే పది లక్షలు, పది లక్షల పెట్టుబడి పెడితే కొన్ని నెలల్లోనే కోటి రూపాయలొస్తాయని, మరికొందరిని చేర్పిస్తే కమీషన్ రూపంలో కాసుల వర్షం కురుస్తుందని వ్యాపారులు ప్రజలను నమ్మిస్తున్నారు. ఇంట్లో కూర్చుని సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌తో డబ్బులు రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు. యూజర్ నేం, పాస్‌వర్డ్ ఉంటే చైన్ సిస్టం ద్వారా లక్షలు సంపాదించొచ్చని చెప్పడంతో అనేక మంది పెట్టుబడులు పెట్టేందుక ఎగబడుతున్నారు. డాలర్లు పెట్టుబడి పెడితే డాలర్ల రూపంలో పాయింట్ల పద్ధతిలో కొందరి ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని తెలిసింది. ఓ వ్యక్తి పెట్టుబడి పెట్టి, మరొకరితో పెట్టుబడి పెట్టిస్తే కమీషన్ ఇస్తున్నారు. దీంతో చాలా మంది పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తం ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు.

అప్పు తీర్చలేక తంటాలు

ఆశలతో తబ్బిబ్బై వారు తెలిసిన వారి వద్ద రూ.లక్షల్లో అప్పులు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో అనేక మంది యువకులు అప్పు చేసి ఆన్‌లైన్‌లో దాదాపు రూ.900 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. పెట్టుబడి పెట్టిన వందమందిలో కేవలం పదిమందికే తిరిగి డబ్బు చెల్లిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన వారికి డబ్బులు తిరిగి రాకపోవడం లో చేసిన అప్పు తీర్చలేక నానా తంటాలు పడుతున్నారు. అయిన వారికి ముఖం చూపించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ నుంచి వచ్చే వడ్డీ మాటేమో కానీ అసలు చెల్లించలేక ఒత్తిడికి గురవుతున్నారు. 

90వేలు పెడితే గోవా, 5 లక్షలకు సింగపూర్

ఆన్‌లైన్ వడ్డీ వ్యాపారంలో డాలర్ల రూపంలో పెట్టుబడి పెడితే బాండ్ పేపర్లుండవు. జగిత్యాల జిల్లాకు చెందిన అనేక మం ది దాదాపు 9 కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. ఓ కంపెనీలో రూ.5 లక్షల పెట్టుబడి పెడితే 8 నెలల్లోపు పెట్టుబడి  ఖాతాల్లో వేస్తున్నట్లు తెలిసింది. మరో కంపెనీలో రూ.10 లక్షలు పెడితే నాలుగు నెలల్లోపు రెట్టింపు ఇస్తూ తిరిగి తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మరో రెండు కంపెనీల్లో 100రోజులు చెల్లించకుండా వడ్డీ ఏ రోజుకారోజు ఆన్‌లైన్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. పెట్టుబడి లెక్కన దేశవిదేశాలకు టూర్లు ఇస్తున్నారు. రూ.90వేలు పెడితే గోవా, రూ.5లక్షలకు సింగపూర్, రూ.12లక్షలకు యూరప్ దేశాలకు టూర్లంటూ వ్యాపారులు యువతను ఆకర్షిస్తున్నారు. 

ఆన్‌లైన్ వ్యాపారంపై ఎస్పీ దృష్టి 

జగిత్యాల జిల్లాలో నడుస్తున్న ఆన్‌లైన్ వ్యాపారంపై ఎస్పీ అశోక్‌కుమార్ దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ వ్యాపారంపై ఆరా తీస్తున్న ఎస్పీ పోలీసులను విచారణకు ఆదేశించినట్లు సమాచారం.